మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న ఎన్‌డీఏ ప్రభు త్వాన్ని గద్దె దించాలని ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. టీపీసీసీ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు ఎ.సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన బుధవారం జిల్లాకేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలోని గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మహాధర్నా నిర్వహించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా గాంధీ విగ్రహం వరకు చేరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నిరసన నిరంతర పోరాటానికి నాంది కావాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అందుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ పన్నెండేళ్ల పాలనతో మధ్య తరగతి, పేద వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులను ఆందోళనకు గురిచేసిన నీట్ పరీక్ష పత్రాల లీకేజీ ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఓటు చోరీ, ప్రస్తుతం సీట్ చోరీకి పాల్పడిందని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. త్వరలో ఎస్‌ఐఆర్ ప్రారంభం అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాకొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, నగర మేయర్ జి.మమత, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.ఆనంద్‌కుమార్‌గౌడ్, నాయకులు సత్తూర్ చంద్రకుమార్‌గౌడ్, ఎస్.వినోద్‌కుమార్, సాయిబాబా, బుద్దారం సుధాకర్‌రెడ్డి, రాములుయాదవ్, సీజే బెన్‌హర్, ఫయాజ్, అజ్మత్‌అలీ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి
జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహా ధర్నా


