● జిల్లాలో 85 పాఠశాలలు ఎంపిక
● ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి నోటిఫికేషన్ జారీ
● ఈ నెల 12 వరకు దరఖాస్తుకు గడువు
హన్వాడ: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 2026– 27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని 85 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో నూతంగా ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ సెక్షన్లలో పనిచేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అర్హతలు.. వేతనాలు
ప్రీ ప్రైమరీ తరగతుల్లో చిన్నారులకు విద్యా బోధన చేసే ఇన్‌స్ట్రక్టర్ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు ప్రీ ప్రైమరీ శిక్షణ లేదా టీటీసీ ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తూ.. గౌరవ భృతి నెలకు రూ.8 వేలు చెల్లించనున్నారు. ఆయా నియామకానికి కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గౌరవ భృతిగా నెలకు రూ.6 వేలు చెల్లించనున్నారు. ఈ వేతనాన్ని ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ ద్వారా చెల్లిస్తారు. నియామకాల్లో స్థానిక ఆవాస ప్రాంత అభ్యర్థులకే ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు విధానం ఇలా..
ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత పాఠశాల లేదా మండల విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తులు పొంది.. పూర్తిచేసిన ఫారాలకు అవసరమైన విద్యార్హతలు, ఆధార్, బోనోఫైడ్, నివాస ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలు జత చేసి ఈ నెల 12లోగా అక్కడే సమర్పించాల్సి ఉంటుంది. కాగా.. జిల్లాలోని హన్వాడ, జడ్బర్ల, భూత్పూర్, దేవరకద్ర, అడ్డాకుల, బాలానగర్, చిన్నచింతకుంట, గండేడ్, కోయిలకొండ, కౌకుంట్ల, మిడ్జిల్, మహమ్మదాబాద్, మూసాపేట్, నవాబ్‌పేట, రాజాపూర్, మహబూబ్‌నగర్ రూరల్, అర్బన్ మండలాల్లోని ఎంపిక చేసిన పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తుల కోసం పూర్తి వివరాలకు మండల విద్యాధికారిని సంప్రదించవచ్చు.


