కూరగాయ తోటల్లో కలుపు నివారణ చర్యలు | - | Sakshi
Sakshi News home page

కూరగాయ తోటల్లో కలుపు నివారణ చర్యలు

Jun 10 2026 12:37 AM | Updated on Jun 10 2026 12:37 AM

అలంపూర్‌: వానాకాలం పంట సాగు చేసేందుకు అన్నదాతలు సిద్ధం అవుతున్నారు. ఈ సీజన్‌లో వివిధ రకాల పంటలతో పాటు కూరగాయలు, పప్పుదినుసుల పంటలు అధికంగా సాగు చేస్తారు. వీటి సాగులో కలుపు నివారించగలిగితేనే ఆశించిన దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్‌ రైతులకు వివరించారు. కలుపు నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గుర్తించి వివరించారు.

కూరగాయల పంట సాగులో..

వంగ, టమాట, ఉల్లి, వెల్లుల్లి పంటలు నాటడానికి ముందు ఎకరాకు 1 నుంచి 1.3 లీ పెండామిథాలిన్‌ లేదా 200 మి.లీ ఆక్సీఫ్లోరాపెన్‌ పిచికారీ చేయాలి. ఉల్లి, వెల్లుల్లి నాటిన 15–20 రోజులకు నేలలో తేమ చూసుకొని 200 మి.లీ ఆక్సీఫ్లోరోఫెన్‌ కూడా వాడవచ్చు. బెండలో విత్తిన వెంటనే లేదా 12 రోజుల్లో ఎకరాకు 1–1.3 లీటర్ల పెండిమిథాలిన్‌ లేదా 1.5–2 లీటర్ల అలాక్లోర్‌ చల్లాలి. క్యాబేజి, కాలిఫ్లవర్‌ నాటడానికి 1 లేదా 3 రోజుల ముందు ఎకరాకు 200 మి.లీ ఆక్సీఫ్లోరోఫెన్‌ చల్లాలి. కంద, చేమ పెండలం వేస్తే కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దపా తడిచ్చాక ఎకరాకు 1.3 లీటర్ల పెండిమిథాలిన్‌ లేదా ఆక్సీఫ్లోరోఫెన్‌ పిచికారీ చేయాలి.

కంది:

కంది విత్తిన వెంటనే 1 లేక 2 రోజుల్లో ఎకరాకు 1–1.3 లీ పెండిమిథాలిన్‌ వాడాలి. విత్తిన 30 లేక 60 రోజుల్లో గొర్రు గుంటకతో అంతర్‌ కృషి చేయాలి. లేదా ఇమజితాపీర్‌ ఎకరాకు 200 మి.లీ పిచికారీ చేయాలి.

మినుము/పెసర:

విత్తిన 1 లేక 2 రోజుల్లో ఎకరాకు 1–1.3 లీ పెండిమిథాలిన్‌ను, విత్తిన 20 రోజులకు గడ్డి జాతి కలుపు నివారణకు 250 మి.లీ పెనాక్స్‌ ప్రాప్‌ ఇథైల్‌ 5 శాతం మందును 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి.

మినుములు :

పొలంలో గడ్డిజాతి వెడల్పాకు ఉంటే ఎకరాకు 200 మి.లీ ఇమిజితాపిర్‌ 10 శాతం పొడి పిచికారీ చేయాలి. ఈ మందు చల్లితే మినుము పెరుగుదల వారంపాటు ఆగినప్పటికి తిరిగి మాముల స్థితికి వస్తోంది.

శనగ :

పైర్లు విత్తిన వెంటనే లేదా ఒకటి లేక రెండు రోజుల్లో ఎకరాకు 1–1.3 లీ. పెండిమిథాలిన్‌ పిచికారీ చేయాలి. సోయా చిక్కుడులో విత్తిన 20 రోజుల సమయంలో 250 మి.లీ ఇమజితాపిర్‌ మందు కూడా పిచికారీ చేయవచ్చు.

వేరుశనగ :

విత్తిన వెంటనే లేదా 1 లేక 2 రోజుల్లో ఎకరాకు 1–1.6 లీ పెండిమిథాలిన్‌ లేదా 1.5–2 లీ. బుటాక్లోర్‌ 50 శాతం విత్తిన 20 లేక 25 రోజుల సమయంలో గడ్డి జాతి కలుపు నిర్మూలనకు ఎకరాకు పైనక్సాప్రాప్‌ ఇథైల్‌ పిచికారీ చేయాలి.

పొలాల్లో పెరిగే పల్లేరు

పొలాల్లో పెరిగే తిక్కబెండ

పాడి–పంట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement