జడ్చర్ల: కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తు జారి కిందపడి దుర్మరణం చెందిన ఘటన స్థానిక రైల్వేస్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్‌ఐ రాజు కథనం మేరకు.. నవాబ్‌పేట మండలం తిమ్మాయిపల్లికి చెందిన బొట్టు శ్రీను(30) జడ్చర్ల రైల్వేస్టేషన్‌లో మహబూబ్‌నగర్ వెళ్లేందుకు గుంతకల్ వెళ్లే రైలు ఎక్కుతుండగా రైలు కదలడంతో ప్రమాదశాత్తు జారి ప్లాట్‌ఫాం మధ్యలో పడి మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
గుర్తు తెలియని
మృతదేహం లభ్యం
కొల్లాపూర్: మండలంలోని జటప్రోల్ గ్రామ సమీపంలో పల్లెరామయ్య చెరువు సమీపంలో స్థానికులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ శంకర్, ఎస్‌ఐ పవన్‌కుమార్, క్లూస్ టీం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. దీనిపై సీఐ మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన రైతు కుర్వ రామస్వామి పొలం వద్ద గుర్తుపట్టలేనంతగాఎముకలు తేలిన మృతదేహం లభ్యమైందన్నానరు. చనిపోయిన వ్యక్తికి సుమారు 40 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉండొచ్చని అంచనా వేశారు. మృతుడు గులాబీ రంగు టీషర్ట్ ధరించిన ఆనవాళ్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. మృతదేహనికి పోర్టుమార్టం చేయడం ద్వారా మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని, ఎవరైనా గుర్తిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కిరాణానికి వెళ్తే.. 12తులాల బంగారం చోరీ
మక్తల్: మక్తల్ పట్టణంలో ఓ కిరాణంలో సరుకులు తీసుకునేందుకు వెళ్లిన ఓ మహిళ చేతి హ్యాండ్‌బ్యాగ్ నుంచి గుర్తుతెలియని మహిళ 12తులాల బంగారం అపహరణకు గురైనట్లు ఆలస్యంగా బయటపడింది. మక్తల్‌లో ఆదివారం సంత ఉండటంతో నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లెకు చెందిన శృతి మక్తల్‌కు వచ్చింది. హ్యాండ్‌బ్యాగ్ తగిలించుకోని కిరాణంలోకి వెళ్తుండగా.. గుర్తుతెలియని మహిళ 12తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మక్తల్ మండలం దాదన్‌పల్లి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తిరిగి వద్దామని ఆదివారం అప్పిరెడ్డిపల్లి నుంచి తన దగ్గరున్న బంగారం తీసుకొని హ్యాండ్‌బ్యాగ్‌లో వేసుకొని వచ్చింది. బస్టాండ్‌లో బస్సు దిగి మారుతి కిరాణం వద్దకు చేరుకొని తమ పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్‌తోపాటు మరికొన్ని సామాన్లను తీసుకొందామని వెళ్లారు. అక్కడ తీసుకొన్న తర్వాత తండ్రికి ఫోన్ చేసి అక్కడి నుంచి బైక్‌పై తండ్రీకూతురు దాదన్‌పల్లికి చేరుకొన్నారు. అయితే సోమవారం బంగారం తీసుకోందామంటే బ్యాగ్‌లో చూసే సరికే లేకపోవడంతో అశ్యర్యపడింది. వెంటనే అప్పిరెడ్డిపల్లిలో తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మక్తల్‌లో మారుతి కిరాణంకు చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశించారు. శృతి సామాన్లను తీసుకుంటుండగా గుర్తుతెలియని మహిళ ఆమె వెంట తిరుగుతూ గమనిస్తుంది. సీసీ ఫుటేజీల్లో కన్పిస్తున్న మహిళ ఎవరని గుర్తుపడటంలేదు. ఆదివారం సంత కావడంతో షాపు రద్దీ అధికంగా ఉండటంతో చోరీ చేసేందుకు అనుకూలంగా ఉండేది. నడిబొడ్డున చోరీ కావడం విశేషంగా మారింది. ఈ విషయమై బాధితురాలు మంగళవారం మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


