కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలంలో మోజర్ల సమీపంలో గల శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో మామిడి పండ్లతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నాబార్డ్ ఆర్థిక సహకారంతో రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వీణ జోష్ మాట్లాడుతూ.. మామిడి పండ్ల నుంచి తయారయ్యే విలువ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉందన్నారు. మహిళలు ఈ శిక్షణలో పాల్గొని ఉత్పత్తుల తయారీ నైపుణ్యాలతో పాటు మార్కెటింగ్ మెలకువలను కూడా నేర్చుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కీలకమైందని, ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు మహిళల సాధికారతకు దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం రాంకీ ఫౌండేషన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చిదంబేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ చిన్నమందడి, పెద్దమందడి తదితర గ్రామాల్లో రైతులకు మామిడి మొక్కలను పంపిణీ చేసినట్లు తెలిపారు. వాటి ద్వారా లభించే మామిడి పంటను సద్వినియోగం చేసుకునేందుకు మహిళా రైతులకు కోతానంతర నిర్వహణ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ అందించడం ద్వారా ఆర్థికంగా లాభపడే అవకాశాలు పెరుగుతాయన్నారు. ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శంకర స్వామి మాట్లాడుతూ కోత అనంతరం పండ్లలో 20 నుంచి 30 శాతం వరకు నష్టం సంభవించే అవకాశం ఉంటుందన్నారు. ఈ నష్టాన్ని తగ్గించేందుకు మామిడి తాండ్రతో పాటు ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం రైతులకు ప్రయోజనకరమన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణలో ఉత్పత్తుల తయారీ, ప్యాకెజింగ్, డిజిటల్ మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ షహనాస్, బేబీ రాణి, 35 మంది మహిళా రైతులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


