‘భూదాన్‌ భూములను రక్షించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘భూదాన్‌ భూములను రక్షించాలి’

Jun 10 2026 12:37 AM | Updated on Jun 10 2026 12:37 AM

జడ్చర్ల: రాష్ట్రంలో భూదాన్‌ భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆయా భూముల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సర్వ సేవా సంఘం జాతీయ ట్రస్ట్‌, తెలంగాణ సర్వోదయ మండల్‌ రాష్ట్ర ఇన్‌చార్జి షేక్‌ హుస్సేన్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్‌ కళా భవనంలో జరిగిన సర్వోదయ మండల్‌ జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాడు వినోభా బావే గొప్ప సంకల్పంతో భూదాన ఉద్యమానికి శ్రీకారం చుట్టారని, భూస్వాముల నుంచి భూములను ప్రభుత్వానికి అప్పజెప్పి ఆయా భూములను భూమి లేని నిరుపేదలకు పంచాలన్న లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు నడిపారని గుర్తు చేశారు. అయితే భూదాన్‌ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లడం వలన అసలు లక్ష్యం నీరుగారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో భూదాన్‌ పోచంపల్లి నుంచి పాదయాత్ర మొదలు పెట్టి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వేల ఎకరాల భూములను సేకరించి పేదలకు పంచారన్నారు. జిల్లాలో దాదాపు 2 వేల ఎకరాల భూదాన్‌ భూములు ఉన్నాయని, ఒక్క భూత్పూర్‌ మండలంలోనే 700 ఎకరాల భూమి ఉందన్నారు. సర్వోదయ మండల్‌ ఆధ్వర్యంలో భూములను వెలికి తీసి పేదలకు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు అవినాష్‌, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌, కార్యదర్శులు శంకర్‌నాయక్‌, గిరిప్రసాద్‌, జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు బాలనర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక:

సర్వోదయ మండల్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జి.సత్యనారాయణరెడ్డి, కార్యదర్శులుగా బాగి కృష్ణయ్య, ఎండీ ఖలీం, ఉపాధ్యక్షుడిగా తెలుగు సత్తయ్య, సహాయ కార్యదర్శిగా సుందర్‌రాజ్‌, కోశాధికారిగా శివకుమార్‌, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్‌, కార్యదర్శిగా సురేశ్‌ను ఎన్నుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement