మహబూబ్ నగర్ న్యూటౌన్: తెలంగాణ వ్యవసా య కార్మిక సంఘం రాష్ట్ర నాల్గవ మహాసభలు మహబూబ్‌గర్‌లో ఈ నెల 20, 21, 22 తేదీల్లో జరగనున్నాయని, సభలను విజయవంతం చేయా లని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వలసలకు నిలయమైన పాలమూరు జిల్లాలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నారని, అత్యంత కరువు సమయంలో వ్యవసాయ కార్మిక సంఘం అంబలి కేంద్రాలు, గంజి కేంద్రాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అలాంటి సంఘం మహాసభలు ఈ జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయన్నారు. సభకు ముఖ్య అతిథిగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హాజరవుతాని, రాష్ట్రం నలుమూలల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు చుట్టుపక్కల ఐదు రాష్ట్రాల నుంచి నాయకత్వం పాల్గొంటారని పేర్కొన్నారు. మహాసభలకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. కార్మిక చట్టాలను పూర్తిగా తొలగించి నాలుగు లేబర్ కోడ్‌లుగా తీసుకొస్తుందన్నారు. ఉపాధి హామీ కూలీలకు వరం లాంటి చట్టాన్ని మార్చి వీబీజీ రామ్‌జీ పథకం పేరుతో పేదలను, కూలీలను కూలికి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో 90 శాతం నిధులు కేటాయించాల్సిన కేంద్ర ప్రభుత్వం కేవలం 60 శాతం కేటాయిస్తామని మిగతా 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘం రాబోయే కాలంలో పెద్దఎత్తున పోరాటాలు చేయడానికి ఈ మహాసభలు పునాదిగా మారుతాయని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, ఏఐటీయూ సీనియర్ నాయకులు కిళ్లే గోపాల్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు రాములు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఇయాల మోహన్, నాయకులు రాజకుమార్, శివవర్మ తదితరులు పాల్గొన్నారు.


