కేసుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

కేసుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు : ఎస్పీ

Jun 10 2026 12:31 AM | Updated on Jun 10 2026 12:31 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అతి సున్నితమైన కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా స్పందించాలని ఎస్పీ జానకి అన్నారు. మహబూబ్‌నగర్‌ రూరల్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని మంగళవారం రాత్రి వార్షిక తనిఖీ నిర్వహించారు. సర్కిల్‌ పరిధిలోని రూరల్‌, హన్వాడ, నవాబ్‌పేట, కోయిలకొండ, మహమ్మదాబాద్‌ స్టేషన్లకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే నేర నియంత్రణ చర్యలు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్‌ కేసులు, వారెంట్లు అమలు, రౌడీషీటర్ల, హిస్టరీ షీటర్ల పర్యవేక్షణ, కమ్యూనిటీ పోలీసింగ్‌పై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒక ఎస్‌హెచ్‌ఓగా అన్ని పోలీస్‌ స్టేషన్ల పనితీరును నిత్యం పర్యవేక్షించాలన్నారు. కేసుల దర్యాప్తులో నాణ్యత మెరుగుపరచాలని, గ్రేవ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నేరాల కట్టడి కోసం గస్తీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, పెండింగ్‌ వారెంట్ల అమలు వేగవంతం చేయాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం తనిఖీలు చేపట్టాలన్నారు. సీసీ టీవీ నిఘా వ్యవస్థ విస్తరణకు కృషి చేస్తూ ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాంధీనాయక్‌ పాల్గొన్నారు.

25 మంది

డీటీలకు పదోన్నతులు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 25 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు మంగళవారం సీసీఎల్‌ఏ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేస్తూ జిల్లాలకు కేటాయించారు. ఇందులో నాగర్‌కర్నూల్‌ జిల్లాకు రాజీవ్‌రెడ్డి, రామకృష్ణ, రవి, పుష్పలత, మహబూబ్‌నగర్‌ జిల్లాకు సుజాతమ్మ, హరిందర్‌రెడ్డి, శ్రీను, సుదర్శన్‌రెడ్డి, బాలరాజు, నారాయణపేట జిల్లాకు గాయత్రి, రాజ్‌గోపాల్‌, కిషోర్‌కుమార్‌, దీపిక, వియోచన, వనపర్తి జిల్లాకు వెంకటేశ్‌, వేణుగోపాల్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, కరుణాకర్‌, నదీమ్‌, గద్వాల జిల్లాకు రాఘవేందర్‌, తిలక్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌, శ్రీనివాస్‌, వాసుదేవరావులను కేటాయించారు. వీరికి ఆయా జిల్లాలోని మండలాలను కలెక్టర్లు కేటాయిస్తారు. అయితే మహబూబ్‌నగర్‌లో చాలామంది డీటీలు ప్రమోషన్‌ను తీసుకోవడానికి ఇష్టంగా లేరని సమాచారం. మహబూబ్‌నగర్‌ను విడిచి ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

ఆర్‌ఎన్‌ఆర్‌ క్వింటా రూ.2,846

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. కాగా.. ఆర్‌ఎన్‌ఆర్‌ రకం క్వింటా గరిష్టంగా రూ.2,846, కనిష్టంగా రూ.1,681 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,016, కనిష్టంగా రూ.1,667, ఆముదా లు క్వింటా గరిష్టంగా రూ.6,275, కనిష్టంగా రూ.6,249, వేరుశనగ గరిష్టంగా రూ.3,100, కనిష్టంగా రూ.3,051 చొప్పున వచ్చాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement