గిరిజన యువత వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజన యువత వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి

Jun 10 2026 12:31 AM | Updated on Jun 10 2026 12:31 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): గిరిజన యువత వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి ఛత్రునాయక్‌ అన్నారు. గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో ట్రైకార్‌ ద్వారా నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కార్యక్రమాలపై గిరిజన యువతకు అవగాహన కల్పించారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయడం, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు పొందాలంటే సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, వ్యక్తిత్వ వికాసం, వృత్తిపరమైన శిక్షణ ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించి, ఉజ్వల భవిష్యత్‌కు బలమైన పునాది వేయగలమని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన యువతీ, యువకులకు నిపుణులు ప్రేరణాత్మక శిక్షణ ఇచ్చారు. ఎస్సెస్సీ, ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసిన 18–35 ఏళ్లలోపు నిరుద్యోగ గిరిజన యువతకు హైదరాబాద్‌లోని మెగా స్కిల్‌ సెంటర్‌లో నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. కోర్సును బట్టి శిక్షణ కాలవ్యవధి 3 నుంచి 6 నెలల వ్యవధి ఉంటుందని, శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ నిర్మల, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఛత్రునాయక్‌, నిపుణులు రవిశంకర్‌, రాంబాబు, నేహా డాలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement