ఆకాశవీధిలో విహారం | - | Sakshi
Sakshi News home page

ఆకాశవీధిలో విహారం

Jun 9 2026 8:46 AM | Updated on Jun 9 2026 8:46 AM

పాఠశాలకు రూ.10 లక్షల సహకారం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు

ప్రతిభ తెచ్చిన అవకాశం

విమానం ఎక్కనున్న

14 మంది విద్యార్థులు

15 ఏళ్లుగా సేవలందిస్తున్న

విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్‌

కల్వకుర్తి రూరల్‌: విద్యార్థులు తమ ఉత్తమ భవిష్యత్‌ను ఊహించుకోవడంతో పాటు ఎన్నో విషయాలపై మరెన్నో కలలు కంటారు. ఆ కలలను సాకారం కొందరే చేసుకుంటారు. సమాజంలో పేద మధ్యతరగతి ప్రజలే అధికంగా ఉండటం.. వారిలో పలువురికి రైలు ఎక్కడమే గగనమైతే విమానం ఎక్కడం అద్భుతమనే చెప్పాలి. అలాంటిది పేద విద్యార్థులకు గగనతలంలో విహరించేలా విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్‌ అవకాశం కల్పించింది.

ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో..

విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలో దాదాపు 22 జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల పాఠశాలలను దత్తత తీసుకున్నారు. ఆ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన వసతులను కల్పించడంతోపాటు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతస్థాయి చేరుకోవాలని లక్ష్యాన్ని వారికి నిర్దేశిస్తున్నారు. పదో తరగతి పరీక్షలకు ముందు 550 మార్కులు సాధించిన విద్యార్థులను విమానంలో ప్రయాణించే అవకాశం కల్పిస్తామన్నారు.దీంతో విద్యార్థులు బాగా కష్టపడి 14 మంది విద్యార్థులు ఆ అవకాశాన్ని దక్కించుకున్నారు. వీరందరిని మంగళవారం విమానంలో శంషాబాద్‌ నుంచి విశాఖపట్నం తీసుకెళ్లి రెండు రోజులపాటు అక్కడ విద్యార్థులకు ఉపయోగప డే కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులందరూ తమలోని భావాలను ఇతర విద్యార్థులతో పంచుకునే విధంగా వారికి శిక్షణ ఇవ్వనున్నారు.

15 సంవత్సరాలుగా సేవ..

పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల, మండలంలోని మార్చాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని 22 పాఠశాలలలో విద్యార్థులకు ఫౌండేషన్‌ ద్వారా నోటుపుస్తకాలతో పాటు పాఠశాలలలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు.

విమానం ఎక్కే విద్యార్థులతో ఫౌండేషన్‌ సభ్యులు

పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలకు ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటి వరకు రూ.10 లక్షలతో వసతులు కల్పించారు. డిజిటల్‌ తరగతితో పాటు, లైబ్రరీ విద్యార్థులకు అవసరమైన మెటీరియల్‌ను పంపిణీ చేశారు. సోమవారం కల్వకుర్తి జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలలో 14 మంది విద్యార్థులను ఫౌండేషన్‌ లోగోతో సత్కరించారు. ప్రధానోపాధ్యాయుడు నాగార్జునతో పాటు ఉపాధ్యాయులు, ఫౌండేషన్‌ బాధ్యులు వాసుదేవ్‌, శేషగిరిరావు, జోసెఫ్‌, శ్రీనివాసులు, శోభ రాణి, రాధిక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement