మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాలో మత్స్యపారిశ్రామిక సహకార సొసైటీలు బలహీనపడుతున్నాయి. సొసైటీల బలోపేతానికి మత్స్యశాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. కొత్త సంఘాల నిర్మాణం అటుంచితే గతంలో ఉన్న సంఘాలను బలోపేతం చేయడంలో జిల్లా మత్స్యశాఖ ఽఅధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కుటుంబాల సంఖ్య పెరగడం, నీటి వనరుల విస్తీర్ణంలో తేడాలు లేకపోవడంతో కొత్త సభ్యుల చేర్పులు, మార్పులకు అవకాశం లేకుండా పోయింది. మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల్లోని సభ్యులు వయోభారంతో తమ స్థానంలో వారసుల పేర్లు ఎక్కించాలన్నా.. చనిపోయిన సభ్యుల స్థానంలో కుటుంబంలోని వారసులకు అవకాశం కల్పించాలన్నా సాధ్యపడటం లేదు. సాంకేతిక సమస్యలతో పాటు వారసుల ఎంపిక సంఘాల బలోపేతానికి సవాల్ విసురుతున్నాయనే చెప్పవచ్చు. మత్స్యకార కుటుంబాలు గ్రామాల్లో గణనీయంగా పెరగడంతో సంబంధిత మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల్లో నూతన సభ్యత్వాలు కల్పించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇదిలా ఉండగా చనిపోయిన సభ్యుల స్థానంలో వారసుల ఎంపిక తలకు మించిన భారంగా మారింది. జిల్లాలో మొత్తం 242 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 13,066 మంది సభ్యులు ఉన్నారు. అందులో 22 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలుండగా 817 మంది సభ్యులున్నారు.
అవకాశమున్న చోట స్కిల్ టెస్టు..
జిల్లాలోని ఆయా గ్రామాల్లో మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల్లో కొత్త సభ్యుల చేరికకు అవకాశమున్న ప్రాంతాల్లో నీటి వనరుల విస్తీర్ణానికి అనుగుణంగా స్కిల్ టెస్టు నిర్వహించి చేర్చుకుంటున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు చెల్లించి స్కిల్ టెస్టులో పాల్గొని అర్హత సాధిస్తే సంఘంలో సభ్యత్వం ఇస్తున్నారు. కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన ఆయా గ్రామాల్లో కొత్త సొసైటీల ఏర్పాటుకు డిమాండ్ పెరిగినా నీటివనరులు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.
హన్వాడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో మొత్తం 95 మంది సభ్యులకు 80 మంది చనిపోగా మిగతా 15 మంది సభ్యులున్నారు. చనిపోయిన వారి స్థానంలో వారసులకు సభ్యత్వం కల్పించాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉండగా.. కుటుంబాల సంఖ్య సైతం పెరిగింది. కొత్తవారికి అవకాశం కల్పించాలని మత్స్యశాఖ అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. హన్వాడ, సల్లోనిపల్లి గ్రామాల్లోని మత్స్యకార కుటుంబాలకు చెందిన వారితో ఉమ్మడి హన్వాడగా ఉన్న సమయంలో మూడు దశాబ్దాల క్రితం ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. చనిపోయిన వారి స్థానంలో వారసులకు, కొత్త వారికి సభ్యత్వాలు కల్పించాలని ఆయా గ్రామాల మత్స్యకారులు కోరుతున్నారు.
చనిపోయిన సభ్యుల స్థానంలో వారసుల ఎంపికపై అయోమయం
నూతన సభ్యత్వాల కోసం పెరుగుతున్న డిమాండ్
జిల్లాలో 242 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 13,066 మంది సభ్యులు


