నారాయణపేట శివారులో దుక్కులు సిద్ధం చేస్తున్న రైతు
నారాయణపేట: రోళ్లు పలిగే రోహిణి కార్తె ఆదివారంతో ముగిసి.. మురిపెంతో మృగశిర సోమవారంతో మొదలవుతుంది. మృగశిర కార్తె అంటే రైతు కళ్లలో కనిపించే ఆశ.. పొలంలో పడే తొలి విత్తనం.. వంటింట్లో ఘుమఘుమలాడే నాటుకోడి కూర, చేపల పులుసు.. వరుణుడి కటాక్షం కోసం ఎదురుచూసే నేలమ్మ. చినుకు పడితే మట్టి పరిమళిస్తుంది. ఎండలతో పగిలిన నేలలు తడి తాకిడికి మళ్లీ శ్వాస తీసుకుంటాయి. ఇది కేవలం వాతావరణ మార్పు కాదు గ్రామీణ జీవనానికి ఓ పండుగ.
జోరుగా సాగు పనులు
మృగశిర కార్తె వచ్చిందంటే వర్షాకాలం ప్రారంభమైనట్లే. రైతులు సాగు పనులకు సిద్ధమవుతారు. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని తొలి జల్లులు పడగానే రైతు గుండెల్లో ఆశల మొగ్గలు చిగురిస్తాయి. ఈ కార్తెలో విత్తనాలు విత్తితే ఇంటికి సిరుల పంట వస్తుందని అనాదిగా అన్నదాతల నమ్మకం. ఇప్పటి నుంచి కొన్ని రోజుల వరకు ఏ రైతు నోట విన్నా.. విత్తనాల ఎంపిక, దుక్కలు సిద్ధం చేసుకోవడం, విత్తనాలు విత్తే సమయం, వర్షం గురించిన మాటలే వస్తుంటాయి. కంది, పెసర, మినుములు, పత్తి వంటి పంటల సాగుకు అనుకూలం.
ఆహారం.. ఆరోగ్యం
కార్తె మొదటి రోజున మాంసాహారులైతే చేపలు, నాటుకోడి తింటారు. శాఖాహారులు అయితే ఇంగువ–బెల్లం కలిపిన మిశ్రమం, అల్లం, శొంఠి ఆహారంలో భాగంగా తీసుకుంటారు. వర్షాకాలంలో వచ్చే జబ్బులు, శ్వాస సమస్యల, ఆస్తమా నుంచి ఇవి రక్షణ కల్పించి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అస్తమా రోగులు మృగశిర కార్తె రోజున అందించే చేప మందు తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని విశ్వాసం.
● నారాయణపేట జిలాల్ల ప్రధానంగా కంది, పెస ర, మినుములు, పత్తి, వరి పంటలు సాగు చేస్తారు. వర్షాధార వ్యవసాయం కావడంతో మొదటి వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అంతర పంటల విధానం ఎక్కువగా కొనసాగుతోంది.
● గద్వాల జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ప్రధానంగా సాగవుతున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరి సాగు ఎక్కువగా ఉంటుంది. వర్షం ఆధారంగా పత్తి సాగు ప్రారంభమవుతోంది.
● వనపర్తి జిల్లాలో వరి సాగు ప్రధానంగా ఉండగా.. పత్తి, కంది పంటలు విస్తృతంగా సాగవుతున్నాయి. బోరు నీటి ఆధారిత వ్యవసాయం ఎక్కువగా కనిపిస్తోంది.
● మహబూబ్‌నగర్ జిల్లాలో వరి, పత్తి, జొన్న, కంది పంటలు ప్రధానంగా సాగవుతున్నాయి. మార్కెట్ పంటలపై రైతులు ఎక్కువగా ఆధారపడుతున్నారు.
● నాగర్‌కర్నూల్ జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటంతో వరి పంట ప్రధానంగా సాగుతోంది. పత్తి, కంది, మొక్కజొన్న ముఖ్య పంటలుగా ఉన్నాయి.
సాగు పనుల్లో నిమగ్నం కానున్న
అన్నదాతలు
ఈ కార్తెలో విత్తనాలు నాటితేనే
మంచిదని నమ్మకం
నేడు చేపలు తింటే ఆరోగ్యం
సిద్ధిస్తుందని విశ్వాసం


