రోడ్లను కమ్మేసిన ఇసుక మేటలు | - | Sakshi
Sakshi News home page

రోడ్లను కమ్మేసిన ఇసుక మేటలు

Jun 8 2026 9:47 AM | Updated on Jun 8 2026 9:47 AM

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

చోద్యం చూస్తున్న ఆర్‌అండ్‌బీ,

మున్సిపల్‌ అధికారులు

అచ్చంపేట: పట్టణంలో బీటీ రోడ్లపై ఇసుక, మట్టి చేరి రహదారి కుదించుకుపోతున్నాయి. ఇసుక మేటలు తొలగించడంలో అర్‌ఆండ్‌బీ, మున్సిపల్‌ అధికారులు చొరవ చూపడంలేదు. దీంతో ఈ రోడ్లపై వెళ్లేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించబోయి ఇసుక, మట్టిలో వాహనం అదుపుతప్పి కిందపడి ప్రమాదాలకు గురవుతున్నారు. అచ్చంపేట–నాగర్‌కర్నూల్‌–శ్రీశైలం ప్రధాన రహదారి నాలుగు వరుసలు, అచ్చంపేట– ఉప్పునుంతల, అచ్చంపేట–లింగాల రోడ్లు రెండు వరుసల రహదారిని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. డబుల్‌ రోడ్లు కూడా ఇసుక మేటలు కమ్మేయడంతో సింగిల్‌ రోడ్లుగా కనిపిస్తున్నాయి. పట్టణంలోని ఉప్పునుంతల రోడ్డు మార్గంలో పశువైద్యశాల నుంచి భారత్‌గ్యాస్‌, మార్కెట్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా మట్టి పేరుకుపోయింది. ప్రధాన రహదారి నాగర్‌కర్నూల్‌, శ్రీశైలం వైపు అదే పరిస్థితి నెలకొంది. మున్సిపల్‌ సిబ్బంది ప్రధాన రహదారులను నిత్యం శుభ్రం చేస్తున్నా.. ఎత్తుగా పేరుకుపోయిన మట్టి, ఇసుక మేటలను తొలగించడం వారికి సాధ్యం కావడం లేదు. ప్రభుత్వం రూ.లక్షలు ఖర్చు చేసి బీటీ రోడ్లు వేస్తే.. అధికారులు మాత్రం పేరుకుపోయిన మట్టి తొలగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాదారులు, ఇళ్ల యాజమానులు ఇంటి ఎదుట ఎత్తుగా మట్టి పోయడం వల్ల బీటీ రోడ్లు కుచించుకుపోతున్నాయి. అధికారులు ఇప్పటికై నా పట్టణంలో బీటీ రోడ్లపై కుప్పలుగా ఉన్న మట్టి, ఇసుక మేటలు తొలగించడంపై దృష్టి పెట్టాలని వాహనదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

వర్షాకాలంలో..

రోడ్డుకు ఇరువైపులా మట్టి కుప్పలు పేరుకోవడంతో వర్షాకాలంలో అది బురదమయంగా మారుతుంది. దీనికి తోడు రోడ్లపై వర్షపు నీరు నిలిచి డ్రెయినేజీలుగా మారుతున్నాయి. దీంతో వాహనాలు సాఫీగా వెళ్లే వీలు లేకపోవడంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతుంది. బీటీ రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిపేందుకు వీలుగా పది ఫీట్ల రోడ్డును వెడల్పు చేయావల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రోడ్ల పక్కనే ఉండే చిరువ్యాపారులను ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీరుతుంది. పోలీసులు, మున్సిపల్‌ అధికారులు సంయుక్తంగా పనిచేసి ఆక్రమణలు తొలగించడంతో పాటు ప్రధాన రోడ్లపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ప్రధాన రహదారిపై మట్టిని తీసేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రధాన రహదారి వంద ఫీట్లతో పాటు వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement