నడిగడ్డలో ఏపీ సర్కార్‌ జులుం | - | Sakshi
Sakshi News home page

నడిగడ్డలో ఏపీ సర్కార్‌ జులుం

Jun 8 2026 9:47 AM | Updated on Jun 8 2026 9:47 AM

‘ఇందిరమ్మ’కు ఇసుక కొరత

రాజోళి: పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అడుగడుగునా గద్వాల జిల్లాపై అక్కసు వెళ్లగక్కుతోంది. నదిలో హద్దులు దాటి.. ఇసుక అక్రమ రవాణా పేరుతో సాధారణ ట్రాక్టర్‌ డ్రైవర్లపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన చోట ఇసుక తీసినా కేసులు నమోదు చేస్తున్నారు. తమ హద్దులో ఉన్నారనుకుని కేసులు చేస్తే సరేలే అని జరిమానాలు కడుతుంటే.. ఏకంగా హద్దులు దాటి గ్రామాల్లోకి వచ్చి మరీ దాడులు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

తుంగభద్ర సరిహద్దుగా..

రాజోళి మండలం, ఏపీలోని కర్నూలు జిల్లా మధ్యలో తుంగభద్ర నది సరిహద్దుగా ఉంది. దీంతో నీటి అవసరాలే కాక, ఇసుకను ఇక్కడి నుంచే సేకరిస్తున్నారు. కాగా ఏపీ అవసరాలకు ఇసుక తీసే క్రమంలో జిల్లా సరిహద్దులోకి వచ్చి ఇసుకను కొ ల్లగొట్టారు. అప్పుడు వారికి గుర్తు లేని సరిహద్దు, జిల్లా నుంచి ఏ ట్రాక్టరైనా అటుగా వెళ్తే వెంటనే మా హద్దులోకి వచ్చారంటూ మైనింగ్‌ అధికారులు, పోలీసులు వచ్చి కేసులు నమోదు చేస్తున్నారు. ఇదంతా చూస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

గతేడాది 50 ట్రాక్టర్లపై..

గతేడాది జిల్లాకు చెందిన 50 ట్రాక్టర్లు తమ హద్దు లోకి వచ్చాయని ఏపీ మైనింగ్‌ అధికారులు రాజోళి మండలం తూర్పు గార్లపాడులోకి వచ్చి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. ‘మా జిల్లాలోకి వచ్చి ఎలా జరిమానా వేస్తా రు’ అని ప్రశ్నించేవారు లేకపోయారు. పది రోజుల కిందట మన సరిహద్దులో ఇసుక రీచ్‌ పరిశీలించేందుకు వెళ్లిన మైనింగ్‌ అధికారులపై కర్నూలు జిల్లా టీడీపీ నాయకుడు బెదిరింపులకు దిగారు. ఇది మరువక ముందే శనివారం రాత్రి ఏపీ పోలీసులు నేరుగా రాజోళి మండల కేంద్రానికి వచ్చి ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఇసుక తీసుకునేందుకు నదిలోకి వచ్చారంటూ స్థానిక ట్రాక్టర్ల యజమానులపై జులుం ప్రదర్శించి, వాహనాలను నిలిపేశారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరదలు వస్తే నష్టపోతున్నాం..

ఇరు ప్రాంతాల నడుమ నది ఉన్నప్పుడు ఇసుక తీసుకునేందుకు మాకు అవకాశం ఉందని, మీ ప్రాంతానికి చెందినవారు తమ హద్దులో ఎన్నోసార్లు ఇసుక తరలించినా మేము పట్టించుకోలేదని స్థాని కులు ఏపీ అధికారులను నిలదీశారు. నదిలో వరద లు వస్తే కర్నూలుతోపాటు తాము కూడా నష్ట పోతున్నామని, అప్పుడు నదిపై మాకెందుకు హక్కు ఉండదని ప్రశ్నించారు. అనుకువగా ఉన్నామని పదే పదే జిల్లా సరిహద్దులు దాటి వచ్చి కేసులు నమోదు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

అనుమతి లేకుండా..

ఈ విషయం తెలుసుకున్న రాజోళి ఎస్‌ఐ గోకారి ఘటనా స్థలానికి చేరుకుని, కర్నూలు జిల్లా పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని, అంతే కానీ.. హద్దులు దాటి, తమ పరిధిలోకి వచ్చి జిల్లా ట్రాక్టర్లను నిలిపేయడం ఏమిటని మండిపడ్డారు. ఇలాంటి తీరుతో ఇరు ప్రాంతాల నడుమ విద్వేషాలు పెరుగుతాయని, ఇది సరైన పద్ధతి కాదని వారించడంతో కర్నూలు పోలీసులు వెనుదిరిగారు.

ఏపీలో ఉచిత ఇసుక పేరుతో జిల్లాలోని నదీతీర గ్రామాల్లోకి వచ్చి వారు తీసుకుంటే పట్టించుకోని జిల్లా అధికార యంత్రాంగం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక తీసేందుకు ఎద్దుల బండి నదిలోకి వెళ్లినా కేసు నమోదు చేస్తుంది. ప్రభుత్వానికి ఆన్‌లైన్‌ చార్జీలు చెల్లించినా కూడా ఇసుక తీసుకునేందుకు భయపడాల్సి వస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన ప్రభుత్వానికి చార్జీలు చెల్లించి.. కర్నూలు నాయకులకు భయపడి ఇసుక తీసుకోకుండా నిర్మాణాలు ఆపేయాల్సిన పరిస్థితి పట్టిందని, దీనిపై జిల్లా నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వాపోతున్నారు. జిల్లాలో ఇప్పటికీ ఏపీ నాయకుల పెత్తనమే నడుస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక రవాణా

అడ్డుకునే నెపంతో

సరిహద్దు దాటుతున్న

పోలీసులు

తాజాగా శనివారం రాత్రి అక్రమ కేసులు

పెట్టేందుకు యత్నం

చోద్యం చూస్తున్న

గద్వాల జిల్లా అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement