నకిలీ విత్తనాలతో మోసపోవద్దు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలతో మోసపోవద్దు

Jun 8 2026 9:47 AM | Updated on Jun 8 2026 9:47 AM

మూస పద్ధతులతో సాగు వద్దు

నాణ్యమైన విత్తనాలు,

పంట వైవిధ్యీకరణే రక్షణ కవచం

శాస్త్రవేత్త డాక్టర్‌ భవాని

మదనాపురం: ఖరీఫ్‌ సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు సాంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగాలని మదనపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ భవాని పిలుపునిచ్చారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, సకాలంలో ప్రత్యామ్నాయ పంటల వైవిధ్యీకరణ ద్వారానే వాతావరణ గండాల నుంచి గట్టెక్కి లాభసాటి దిగుబడులు సాధించవచ్చని స్పష్టం చేశారు.

విత్తనమే పంటకు పునాది..

విత్తనం నాణ్యతపైనే పంట ఉత్పాదకత ఆధారపడి ఉంటుందని డాక్టర్‌ భవాని పేర్కొన్నారు. ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను నాటడం ద్వారా పంట దిగుబడిని 15 నుంచి 20 శాతం వరకు పెంచుకోవచ్చు.దీనికి శాసీ్త్రయ పంట యాజమాన్య పద్ధతు లు తోడైతే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. విత్తనాల్లో కనీసం 98 శాతం భౌతిక స్వచ్ఛత ఉండాలి. కలుపు విత్తనాలు, ఇతర రకాల గింజలు, పురుగు ఆశించినవి లేదా విత్తన జనిత వ్యాధులు ఉన్న వా టిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. విత్తనాల్లో తేమ శాతం 8 నుంచి 10 శాతం లోపు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ తేమ ఉంటే నిల్వ సా మర్థ్యం తగ్గడమే కాకుండా, బూజు (శిలీంధ్రాలు) ముక్కు పురుగుల సమస్య ఎక్కువవుతుంది.

కొనుగోలు సమయంలో

జాగ్రత్తలు తప్పనిసరి..

నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండేందుకు రైతులు కింది అంశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లైసెన్స్‌ పొందిన డీలర్లు, ప్రభుత్వ సంస్థలు లేదా గుర్తింపు పొందిన విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనాలి. విత్తన సంచిపై రకం పేరు, లాట్‌ నంబర్‌, మొలకశాతం, భౌతిక స్వచ్ఛత, తేమ శాతం, గడువు తేదీ అలాగే ధృవీకరణ (సర్టిఫికేషన్‌) ట్యాగ్‌ కచ్చితంగా చూసుకోవాలి. చిరిగిన, తెరిచి మళ్లీ కుట్టిన సంచులను నమ్మి మోసపోవద్దు. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి రశీదు (బిల్లు)ను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలి. ఇంటి వద్ద నిల్వ ఉంచుకున్న విత్తనాలను నాటడానికి ముందే ఇంట్లోనే మొలకశాతం పరీక్ష చేసుకుని, సంతృప్తికరంగా ఉంటేనే వాడుకోవాలి.

వివిధ పంటల కనీస మొలక శాతాలు..

రైతులు తాము కొనుగోలు చేసే విత్తనాలకు కనీసం ఈ కింది స్థాయిలో మొలకశాతం ఉండేలా చూసుకోవాలి. వరి 80% మొక్కజొన్న 90% జొన్న సజ్జ 75% పప్పు ధాన్యాలు మినుము కంది 75% వేరుశనగ 70% సోయబీన్‌ 70 శాతం పత్తి హైబ్రిడ్‌ 75 శాతం ఉండాలి. ఒకే రకమైన సాంప్రదాయ పంటలపై పెట్టుబడి పెట్టి నష్టపోవద్దు. తక్కువ నీటితో, తక్కువ కాలవ్యవధిలో చేతికొచ్చే పప్పుధాన్యాలు నూనెగింజలు (వేరుశనగ, పొద్దుతిరుగుడు) తోటపంటలు మరియు కూరగాయల సాగు వైపు పంట వైవిధ్యీకరణ చేపట్టాలి. ఇది వాతావరణ నష్టాల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా, మార్కెట్లో నిరంతర ఆదాయాన్ని అందిస్తుంది.తమ ప్రాంత నేల స్వభావం, నీటి లభ్యత మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పరిశోధన సంస్థలు సిఫారసు చేసిన రకాలను ఎంపిక చేసుకోవాలని, సం దేహాలుంటే అధికారులను సంప్రదించాలన్నారు.

పాడి–పంట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement