● ఎద్దు మృతి.. రైతుకు గాయాలు
చిన్నచింతకుంట: వేగంగా దూసుకొచ్చిన లారీ ఎద్దుల బండిని ఢీకొట్టిన ప్రమాదంలో ఓ ఎద్దు మృతి చెందగా రైతుకు గాయాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండలంలోని ఉంధ్యాల గ్రామానికి చెందిన గొల్ల శేషన్న పొలం నుంచి పనులు ముగించుకొని ఎద్దుల బండిపై ఇంటికి వస్తున్న క్రమంలో గ్రామ సమీపంలోని బీటీరోడ్డుపై ఆత్మకూర్ వైపు వెళ్తున్న లారీ అతివేగంతో ఎద్దుల బండిని ఢీకొట్టింది. దీంతో బండి ముక్కలవగా ఓ ఎద్దు అక్కడికక్కడే మృతి చెందగా, శేషన్నకు గాయాలయ్యాయి. శేషన్నను చికిత్స నిమిత్తం మహబుబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటు చేసుకుందని గ్రామస్తులు ఆరోపించారు. దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
తిమ్మాజిపేట: బావిలో ఈత పడేందుకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వడ్ల చెన్నకేశవులు (54) ఆదివారం కొందరితో కలిసి తిమ్మాజిపేట సమీపంలోని గుండోని బావికి ఈతకు వెళ్లాడు. కొంతసేపు బావిలో ఈత పడిన తర్వాత చెన్నకేశవులు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తోటి వ్యక్తులు నాగర్‌కర్నూల్‌లోని ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బావిలో గాలించి చెన్నకేశవులును బయటికి తీసి పరీక్షించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గద్వాల క్రైం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కేటీదొడ్డి మండలంలోని గువ్వలదిన్నె గ్రామానికి చెందిన బోయ శివ (28) వ్యక్తిగత పనుల నిమిత్తం బొలెరో వాహనంలో గద్వాలకు వస్తున్నాడు. ఈ క్రమంలో గోనుపాడు సమీపంలో బొలెరోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన క్రమంలో శివకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లాలని సూచించారు. అయితే కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం శివ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.
వ్యక్తిపై కత్తితో దాడి
ఘటనలో కేసు నమోదు
జడ్చర్ల: ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన మండలంలోని చిన్నఆదిర్యాల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. శనివారం రాత్రి చిన్నఆదిర్యాల్ గ్రామానికి చెందిన చీరాల శ్రీకాంత్, అతని స్నేహితుడు శివ గ్రామంలోని కిరాణంలో ఉండగా.. అదే గ్రామానికి చెందిన దుబ్బా సుధాకర్ వచ్చి శివతో గొడవపడ్డాడు. దీంతో శ్రీకాంత్ వారిని వారించాడు. కానీ సుధాకర్ శ్రీకాంత్‌తో సైతం గొడవకు దిగడంతో అక్కడే ఉన్న స్థానికులు వారిని సముదాయించి, ఇంటికి పంపించారు. కాగా కొద్దిసేపటికే సుధాకర్ కత్తితో తిరిగి వచ్చి కిరాణం వద్ద ఉన్న శ్రీకాంత్‌పై దాడి చేసి వీపుభాగంలో పొడిచాడు. మరోసారి పొడవబోతుండగా అదే గ్రామానికి చెందిన కొందరు అడ్డుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బాధితుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.


