ఇటీవల 8 మంది బదిలీ..
మున్సిపల్ కార్పొరేషన్‌లో తిష్టవేసిన పలువురు ఉద్యోగులు
● 10–15 ఏళ్లుగా ఒకేచోట విధుల నిర్వహణ
● ఇటీవల బదిలీల్లోనూ
మారని సీనియర్ ఉద్యోగులు
● ఏళ్లుగా ఉండటంతో అన్ని వ్యవహారాల్లో తలదూర్చుతున్నట్లు ఆరోపణలు
● కార్పొరేషన్‌లో
విచిత్ర పరిస్థితిపై సర్వత్రా చర్చ
●
ఇటీవల జరిగిన బదిలీలు నిబంధనల ప్రకారమే చేశాం. ఉన్న కేడర్‌లో కనీసం 40 శాతం బదిలీలు చేయాలని ప్రభుత్వం సూచించింది. కొంతమంది సీనియర్లు కూడా పనిచేస్తూ ఉండవచ్చు. ఓ వ్యక్తి కోర్టు కేసు వల్ల ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూస్తాం..
– రామాంజులారెడ్డి, కమిషనర్,
మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సాధారణంగా ఎవరైనా ఉద్యోగి రెండేళ్లకో.. మూడేళ్లకో.. మహా అంటే ఐదేళ్లకో బదిలీ అవుతారు. కానీ, మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కొంతమంది ఉద్యోగులు ఏళ్లతరబడిగా తమ కుర్చీ వదలకుండా అలాగే అంటిపెట్టుకొని ఉండటం పెద్ద చర్చకు తావిస్తోంది. ఇటీవల ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పించినప్పటికీ చాలామంది సీనియర్లు ఇక్కడే పాతుకుపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఒక ఉద్యోగి కనీసం 4 నుంచి 8 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేస్తే వెంటనే బదిలీ కావాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పలువురు సిబ్బందికి మాత్రం ఈ నిబంధనలు వర్తించడం లేదు. ఏళ్ల తరబడిగా ఒకేచోట పనిచేస్తున్న వీరు తమదైన శైలిలో కార్పొరేషన్‌లో చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో 330 మందికిపైగా సిబ్బంది పనిచేస్తుండగా.. మరికొన్ని పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. అయితే కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది పూర్తి వివరాలు, సీనియార్టీ జాబితా అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం.
తీవ్రస్థాయిలో ఆరోపణలు..
కార్పొరేషన్‌లో చాలా ఏళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. కార్పొరేషన్ పరిధిలో జరిగే టెండర్లు, కాంట్రాక్టుల విషయంలో వీరు తలదూర్చుతున్నట్లు తెలుస్తుంది. పలు సెక్షన్‌లకు సంబంధించి కీలకమైన అధికారులు పౌర సేవల కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, ఫీల్డ్ వర్క్ పేరుతో ఎక్కువ సమయం బయటే ఉంటున్నట్లు సమాచారం. దీంతో వివిధ పనుల నిమిత్తం దరఖాస్తు చేసుకునే ఫైల్స్ ఉద్దేశ పూర్వకంగానే పలువరు సిబ్బంది ఆలస్యం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం గత నెలలో కార్పొరేషన్‌లో పనిచేస్తున్న సిబ్బందికి బదిలీల ప్రక్రియ చేపట్టగా అందులో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఒక సీనియర్ అకౌంటెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఒక వార్డు ఆఫీసర్, ఒక వాచ్‌మెన్, లైన్‌మెన్, ఇద్దరు అటెండర్లు బదిలీపై వెళ్లగా.. వారి స్థానంలో మరో ఇద్దరు మాత్రమే కార్పొరేషన్‌కు బదిలీపై వచ్చారు.


