మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా కోర్టుతోపాటు జడ్చర్లలో ఈ నెల 20న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డి.జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ సమయంలో ఎలాంటి ఖర్చు లేకుండా కేసులు రాజీ అయ్యే ఏకై క మార్గం లోక్ అదాలత్ అన్నారు. పోలీస్ శాఖ పరిధిలో పెండింగ్ కేసులు, ట్రాఫిక్ చలానాలు, రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాల కేసుల కక్షిదారులు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకుంటే దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియ నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజీ అయ్యే అవకాశం ఉన్న ప్రతి కేసు గుర్తించి లోక్ అదాలత్‌లో హాజరయ్యేలా కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు, సదరు ఎస్‌హెచ్‌ఓలు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ముగిసిన సాఫ్ట్‌బాల్ సమ్మర్ క్యాంప్
మహబూబ్‌నగర్ క్రీడలు: నగరంలోని మెయిన్ స్టేడియంలో జిల్లా క్రీడాప్రాధికారిక సంస్థ, మహబూబ్‌నగర్ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాఫ్ట్‌బాల్ సమ్మర్ క్యాంప్ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా మెయిన్ స్టేడియంతోపాటు కొతలాబాద్ (రూరల్)లో నిర్వహించిన సాఫ్ట్‌బాల్ సమ్మర్ క్యాంప్‌ల క్రీడాకారులకు టోర్నమెంట్ నిర్వహించి విన్నర్, రన్నరప్ జట్లకు మెడల్స్, ట్రోఫీలు అందజేశారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లా సాఫ్ట్‌బాల్ క్రీడాకారులు మరింత ప్రతిభచాటి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శరత్‌చంద్ర, జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు రాఘవేందర్, నాగరాజు పాల్గొన్నారు.
ఉల్లాసంగా ‘హ్యాపీ సండే’
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రతి ఆదివారం నగరంలోని జిల్లా ప్రధాన స్టేడియం కమాన్ వద్ద నిర్వహిస్తున్న ‘హ్యాపీ సండే’ ఉల్లాసంగా ముగిసింది. ఈ మేరకు ఆదివారం చివరిరోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఉత్సాహంగా.. కోలాహలంగా కొనసాగింది. ఎస్‌హెచ్‌జీ మహిళలతో కలిసి నగర మేయర్ మమత తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా నృత్యం చేశారు. పలు డాన్స్ అకాడమీలకు చెందిన విద్యార్థులతోపాటు సీనియర్ సిటిజన్స్ సాంస్కృతిక ప్రదర్శనలిచ్చి తమలోని ప్రతిభను చాటారు. అలాగే మ్యాజిక్, కరాటే విన్యాసాలు అలరించాయి. అనంతరం అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులను ఘనంగా సత్కరించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామాంజులరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌జీ, లక్ష్మయ్య పాల్గొన్నారు.


