‘పాలమూరు’పై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు | - | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’పై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు

Jun 8 2026 9:41 AM | Updated on Jun 8 2026 9:41 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ నేతలకు లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్‌ అక్తర్‌, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ అన్నారు. ఆదివారం వారు జిల్లాకేంద్రంలోని పీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉండి ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిన వారు ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి పాలమూరు అభివృద్ధికి పెద్దపీట ఇవేమీ చర్చించకుండా మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి తదితరులు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2016లో పాలమూరును ప్రారంభిస్తే 2022 వరకు కేంద్రానికి డీపీఆర్‌ ఎందుకు సమర్పించలేదన్నారు. వరద ఆధారంగా కాకుండా మిగులు జలాలతో చేపడుతున్నామని అప్పట్లో నివేదించింది వాస్తవమా.. కాదా.. అని ప్రశ్నించారు. ఇది సాగునీటి ప్రాజెక్టు కాదు.. తాగునీటి ప్రాజెక్టు అని.. కేవలం 7.15 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించడం ఎవరూ మరిచిపోలేదన్నారు. వీటన్నింటికీ బీఆర్‌ఎస్‌ నేతలు సరైన సమాధానం చెప్పిన తర్వాతే ప్రజల్లోకి రావాలన్నారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి రాములుయాదవ్‌, నాయకులు కృష్ణయ్య, అక్బర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement