గట్టు: గట్టు ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, బీడు భూములకు సాగునీరు అందించాలని ఉమ్మడి పాలమూరు జిల్లా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లా జేఏసీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా జేఏసీ కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ దశాబ్దాల పాటు గట్టు ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడిందన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా గట్టు ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగునీటిని అందించలేదని మండిపడ్డారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆర్డీఎస్‌ను ఆధునీకరించి, సాగునీటిని చివరి ఆయకట్టు వరకు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కో కన్వీనర్ బెక్కం జనార్దన్, జేఏసీ చైర్మన్ వీరభద్రప్ప, కన్వీనర్ ఆలూరు ప్రకాష్‌గౌడు, కోఆర్డినేటర్ మధుసూదన్‌బాబు, నాయకులు హనీఫ్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, చెన్నకిష్టప్ప, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
నీరు ఎత్తిపోసేందుకు టెక్నాలజీని వాడుకోలేరా?
రాజోళి: సాంకేతికంగా ఎంతో పరిజ్ఞానం ఉండి, అన్ని రంగాల్లో దాన్ని వినియోగిస్తుంటే నడిగడ్డలో మాత్రం నీటిని ఎత్తిపోసేందుకు టెక్నాలజీ ఎందుకు వాడట్లేదని ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి సభ్యులు ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా శనివారం తుమ్మిళ్ల ఎత్తిపోతలను పరిశీలించారు. అనంతరం వడ్డేపల్లిలో సమావేశం చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కర్ణాటక మంత్రితో కలిసి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆర్‌డీఎస్ దుస్థితిపై ఎందుకు ఆయనను ప్రశ్నించలేదన్నారు. ఆర్డీఎస్ కెనాల్‌ను ఆధునీకరించి, కేసీ కెనాల్ లాగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గోపాల్‌రెడ్డి, ప్రకాష్ గౌడ్, మధుసూదన్ బాబు, రామ్మోహన్, బెక్కెం జనార్దన్, రాఘవాచారి, పరమేశ్వర్ గౌడ్, వీరభద్రప్ప తదిదరులు పాల్గొన్నారు.


