మహబూబ్‌నగర్ క్రైం: సులువుగా డబ్బు సంపాదించడానికి కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు కేటుగాళ్లు. ఇంట్లో ఫంక్షన్ ఉందని చెబుతూ టెంట్‌హౌజ్ దగ్గరకు వెళ్లి పలు సామగ్రిని(అన్ని రకాల గిన్నెలు) అద్దెకు తీసుకొని ఇతర వ్యక్తులకు విక్రయిస్తున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ కథనం ప్రకారం.. నగరంలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే ఎండీ బాసిత్ అలీ క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. తను చేస్తున్న వృత్తిలో ఆదాయం లేకపోవడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో టెంట్ హౌజ్‌ల్లో అద్దెకు సామగ్రిని తీసుకోవడం వాటిని ఇతరులకు విక్రయించడం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 15న విష్ణు టెంట్ హౌజ్ వద్ద, మార్చి 17న దొడ్డలోనిపల్లిలో ఉన్న ఖాజా టెంట్ హౌజ్, మార్చి 2న షాషాబ్‌గుట్టలోని షా టెంట్‌హౌజ్‌లో, మార్చి 5న షాషాబ్‌గుట్టలోని ఏఆర్ టెంట్‌హౌజ్ వద్ద ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి సామగ్రి అద్దెకు తీసుకొని వెళ్లాడు. దీనిపై అనుమానం వచ్చిన శ్రీవిష్ణు టెంట్ హౌజ్ యాజమాని విష్ణు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి శనివారం బాసిత్ అలీని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అతని వద్ద రూ.2.95 లక్షల విలువ చేసే బొగనాలు 20, లగాన్లు 4, హండీలు ఒకటితో పాటు ఇతర సామగ్రిని రికవరీ చేసి అలీని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. విలువైన వస్తువులు కానీ వాహనాలు అద్దెకు ఇచ్చే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ సూచించారు.
టెంట్ హౌజ్ సామగ్రితో కొత్త రకం మోసం


