ఇటిక్యాల: దేశంలోని రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున మెగా అగ్రి క్రెడిట్ అవుట్‌రీచ్ క్యాంప్ నిర్వహిస్తుందని హైదరాబాద్ రీజినల్ హెడ్ గజేంద్రసింగ్‌చౌహన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సీబీఐ బ్యాంక్ ఆవరణలో రైతులకు, ఖాతాదారులకు రుణ సదుపాలయపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి రుణాలు పొందడం సమస్యగా మారిందన్నారు. ఈ ఇబ్బందిని తొలగించడానికి బ్యాంకే నేరుగా రైతుల వద్దకు వెళ్లేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిచామన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో ఒకేసారి వందలాది చోట్ల వ్యవసాయ రుణాల పంపిణీ శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపులో రైతుల దరఖాస్తులను, భూమి పత్రాలను అక్కడికక్కడే పరిశీలించి అతి తక్కువ సమయంలో (అన్‌ది స్పాట్) రుణాలను మంజూరు చేస్తారన్నారు. రైతులు దళారీలను ఆశ్రయించి మోసపోకుండా, నేరుగా బ్యాంక్ అధికారుల ద్వారానే పారదర్శకంగా సేవలు అందిస్తామన్నారు. వ్యవసాయ రంగాలన్నింటికీ పెద్దపీట వేస్తామని, కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగించి తక్కువ వడ్డీరేట్టకే ప్రభుత్వ రాయితీ రుణాలు అందించున్నట్లు తెలియజేశారు. హైదరాబాద్ రీజియన్‌లో సుమారు రూ.50 కోట్ల విలువైనా వ్యవసాయ రుణ మంజూరు పత్రాలను రైతులకు అందజేయగా, ఇందులో ఇటిక్యాల శాఖకు ఒక్కటే రూ.2 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు, ఎమ్మార్వో శ్రీకాంతరెడ్డి, సర్పంచ్ జీవేందర్‌రెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ సలోమి, బ్యాంక్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


