వంగూరు: ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి సమీపంలో విధి నిర్వహణలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ రాజు పిడుగుపాటుకు గురై శుక్రవారం మృతి చెందాడు. ఎస్పీ సంగ్రామ్‌సింఘ్‌జీ పాటిల్ ఆదేశాల మేరకు రాజు స్వగ్రామం వంగూరు మండలంలోని ఉల్పర గ్రామంలో శనివారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు హాజరైన అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు రాజు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రూ.30 వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజు కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు. అంత్యక్రియల్లో ఆర్‌ఐ జగన్, ఆర్‌ఎస్‌ఐ ప్రశాంత్, ఎస్‌ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
జడ్చర్ల: పట్టణంలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు వచ్చిన తండ్రి లారీ ఢీకొని మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. బిజినపల్లి మండలం వెలుగొండకు చెందిన ఈర్ల సంజీవ(51) జడ్చర్లలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు భార్యతో కలిసి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. కాగా శనివారం సాయంత్రం కుమార్తెకు పండ్లు తీసుకొని రావటానికి బైకుపై వెళ్తుండగా ఫ్‌లైవర్ సమీపంలో ఓ లారీ వేగంగా ఢీకొట్టింది ప్రమాదంలో లారీ చక్రాలు అతనిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఈర్ల మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ కమలాకర్ తెలిపారు.


