బైక్‌పై వెళ్లి ఉపాధి పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

బైక్‌పై వెళ్లి ఉపాధి పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్‌

Jun 7 2026 8:54 AM | Updated on Jun 7 2026 8:54 AM

మహబూబ్‌నగర్‌ రూరల్‌: పని ప్రదేశానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అధికారులే వెనక్కి తగ్గే పరిస్థితుల్లో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ స్వయంగా బైక్‌ నడుపుకుంటూ కూలీల వద్దకు చేరుకుని మాట్లాడిన ఘటన శనివారం మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలోని పోతన్‌పల్లిలో ఆసక్తికరంగా మారింది. గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఉపాధి పనులు జరుగుతుండగా.. అక్కడికి కారు వెళ్లేందుకు అనుకూల పరిస్థితుల్లేవు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బైక్‌ను అదనపు కలెక్టర్‌ స్వయంగా నడుపుకుంటూ పని ప్రదేశానికి చేరుకున్నారు. ఉపాధి కూలీలు చేస్తున్న పనులను పరిశీలించి కొలతల విధానంపై ఆరా తీశారు. కూలీలు స్పందిస్తూ అధికారులిచ్చిన కొలతల ప్రకారమే పనులు చేస్తున్నామని, ఒక్కొక్కరికి సగటున రోజుకు రూ. 300 వరకు కూలి వస్తుందని వివరించారు. అంతకుముందు పోతన్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం గ్రామ నర్సరీతోపాటు ఓబ్లాయిపల్లి, కోటకదిర, మాచన్‌పల్లి నర్సరీలు పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ కరుణశ్రీ, ఎంపీఓ శంకర్‌నాయక్‌, ఏపీఓ రాజశేఖర్‌రెడ్డి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ రాజురెడ్డి, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement