● పెట్రోల్ బంక్ నుంచి పరిశ్రమల దిశగా..
● భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు పేట మహిళా సమాఖ్య సిద్ధం
● వేరుశనగ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటుకు కసరత్తు
● మార్కెట్ చైర్మన్‌తో చర్చించిన హైదరాబాద్ బృందం
నారాయణపేట: ఒకప్పుడు కేవలం పొదుపుకే పరిమితమైన మహిళా సంఘాలు నేడు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నాయి. నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన నేపథ్యంలో ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు జిల్లా మహిళా సమాఖ్య సిద్ధమవుతోంది. జిల్లాలో విస్తారంగా పండే వేరుశనగ పంటకు విలువ జోడిస్తూ రూ.కోటితో వేరుశనగ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో శుక్రవారం హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణుల బృందం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, చిన్న తరహా పారిశ్రామిక శాఖ అధికారుల బృందం జిల్లాకు చేరుకుంది. సెర్ప్ ఆధ్వర్యంలో మద్దూర్, దామరగిద్ద ప్రాంతాల్లో పర్యటించి ముడిసరుకు లభ్యత, మార్కెట్ అవకాశాలు, రవాణా సౌకర్యాలు, మహిళా సంఘాల భాగస్వామ్యం వంటి అంశాలను అధ్యయనం చేసింది.
పల్లీలకు విలువ.. రైతులకు లాభం
నారాయణపేట జిల్లాలో మద్దూర్, దామరగిద్ద, మక్తల్, మరికల్, ఊట్కూర్ తదితర మండలాల్లో వేల ఎకరాల్లో వేరుశనగ సాగు జరుగుతోంది. పంట దిగుబడి బాగున్నప్పటికీ రైతులు తరచూ మార్కెట్ ధరల హెచ్చుతగ్గులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లీలను ముడి రూపంలో విక్రయించడంతో రైతులకు పరిమిత లాభాలే మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల నుంచి నేరుగా వేరుశనగను కొనుగోలు చేసి, పల్లీ నూనె, చిక్కీలు, పల్లీ లడ్డూలు, పల్లీ పొడి, పల్లీ మిఠాయిలు, పశువుల దాణా వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తే రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
మహిళా సమాఖ్యకు మరో భారీ బాధ్యత
జిల్లా మహిళా సమాఖ్య ఇప్పటికే పెట్రోల్ బంక్ నిర్వహణలో రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకుంది. మహిళల నిర్వహణ సామర్థ్యానికి ఇది నిదర్శనంగా నిలిచింది. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని వేరుశనగ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాలనే ప్రతిపాదనకు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది అమలైతే వందలాది మంది మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. ఉత్పత్తుల తయారీ నుంచి ప్యాకేజింగ్, మార్కెటింగ్ వరకు మహిళలే కీలక పాత్ర పోషించనున్నారు.


