బిజీబిజీగా రెండు రోజులు | - | Sakshi
Sakshi News home page

బిజీబిజీగా రెండు రోజులు

Jun 6 2026 1:35 AM | Updated on Jun 6 2026 1:35 AM

సాక్షి, నాగర్‌కర్నూల్‌/జడ్చర్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం ఉమ్మడి జిల్లాలోని మక్తల్‌కు హెలికాప్టర్‌ ద్వారా చేరుకున్న ఆయన శుక్రవారం రాత్రి వరకు ఉమ్మడి జిల్లాలోనే పూర్తిసమయం కేటాయించారు. మొదటి రోజున జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో కృష్ణానదిపై నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి కం బ్యారేజ్‌ ప్రతిపాదిత స్థలాన్ని ఏరియల్‌వ్యూ ద్వారా పరిశీలించారు. సాయంత్రం 6గంటలకు నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలో కృష్ణాతీరంలోని సోమశిలకు చేరుకున్నారు. రాత్రి 7గంటల నుంచి 10గంటల వరకు సుమారు 3గంటలపాటు ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులతో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం సోమశిలలోని మృగవాణి రిసార్ట్‌లో బసచేశారు.

ఉదయం నుంచి రాత్రి వరకు బిజీబిజీ

ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం నుంచి రాత్రి వరకు ప్రాజెక్టుల సందర్శనలు, పంప్‌హౌస్‌లు, లిఫ్టులు, రిజర్వాయర్లు, టన్నెల్‌ పరిశీలన, ప్రెస్‌మీట్‌, బహిరంగ సభలతో తీరిక లేకుండా గడుపుతూనే హుషారుగా కనిపించారు. శుక్రవారం ఉదయం సోమశిల నుంచి కొల్లాపూర్‌లోని మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసానికి చేరుకుని మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. ఉదయం 9:30 గంటలకు కృష్ణాతీరంలోని నార్లాపూర్‌ పంప్‌హౌస్‌ చేరుకుని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ మొదటి లిఫ్టు, మోటారు బిగింపు, హెడ్‌ రెగ్యులేటరీ, ప్రధాన కాల్వ, పెండింగ్‌ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడే ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌, సర్జ్‌పూల్‌, మోటార్లు, ఎల్లూరు రిజర్వాయర్‌ను సందర్శించి వేసవి సందర్భంగా తాగునీటి సరఫరాకు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా కుమ్మెర పంప్‌హౌస్‌కు చేరుకుని మూడో లిఫ్టు మోటార్లు, సొరంగంలోకి వెళ్లి పంప్‌హౌస్‌ నిర్మాణ పనులను పరిశీంచారు. వట్టెం రిజర్వాయర్‌ను సందర్శించారు. అక్కడి నుంచి నేరుగా భూత్పూర్‌ సమీపంలోని కరివెన రిజర్వాయర్‌ పనులను పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ చేరుకుని కొనసాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాయంత్రం 7గంటలకు జడ్చర్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు చేరుకుని ప్రసంగించారు. సభ అనంతరం రాత్రి 9 గంటల సమయంలో రోడ్డుమార్గంలో హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.

ఉమ్మడి జిల్లాలో ముగిసిన సీఎం పర్యటన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement