మహబూబాబాద్ రూరల్ : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఇష్టారీతిన రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయవద్దని టౌన్ సీఐ ఎల్.రఘుపతి రెడ్డి అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని డాక్టర్స్ వీధిలో ఆస్పత్రుల ఎదుట ద్విచక్ర వాహనాలు ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయడంపై శనివారం సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారి బంధువులు తమ ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఒక పద్ధతి ప్రకారం వాహనాలను పార్కింగ్ చేసుకోవాలే తప్ప ఎదుటి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తేవిధంగా ప్రవర్తించవద్దని సూచించారు. సీఐ సూచన మేరకు ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ పాపులాల్, హోంగార్డులు జంపయ్య, దేవేందర్ డాక్టర్స్ వీధిలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.
నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
పెద్దవంగర: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్త టాస్క్‌ఫోర్స్ అధికారులు సూచించారు. మండలంలోని రైతువేదికలో శనివారం విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు డీలర్లకు వానాకాలం పంటల సాగుకు సంబందించిన విత్తనాల విక్రయాలు, నిల్వలు, నాణ్యతా ప్రమాణాలపై పలు సూచనలు చేశారు. రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో తప్పని సరిగా రశీదు ఇవ్వాలని, స్టాక్ రిజిస్టర్లు చూసుకోవాలని, అనుమతిలేని నకిలీ విత్తనాలను విక్రయించొద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలతో పాటు లైసెన్స్‌ను రద్దుకు సిఫారసు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ స్వామి నాయ క్, ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్, రెవెన్యూ అధికారులు, ఏఈఓలు, డీలర్ల సంఘం అధ్యక్షుడు దామోదర్, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
శనిత్రయోదశి..భక్తులు కిక్కిరిసి!
కాళేశ్వరం: శని త్రయోదశి, మాసశివరాత్రి పురస్కరించుకొని కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో నవగ్రహాల వద్ద శని, సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలను శనివారం భక్తులు అధికంగా ని ర్వహించారు. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి ఆలయంలో బారులుదీరారు. నవగ్రహ, కాలసర్ప పూజలు చేసిన భక్తులు స్వామివారి గర్భగుడిలో విశేష అభిషేక పూజలు నిర్వహించారు.
17న భద్రకాళి ఆలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్ఠ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో ఈనెల 17న నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుందని భద్రకాళి ఆలయ ఈఓ సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు, ఈమేరకు జూన్ 15న సోమవారం నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. జూన్ 17న బుధవారం ఉదయం 8.36 గంటలకు కర్కాటక లగ్నంలో జరిగే ప్రతిష్ఠాపనోత్సవంలో జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు శ్రీశ్రీవిద్యాశంకర భారతీస్వామి పాల్గొని ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహిస్తారని తెలిపారు. అదేవిధంగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు.


