మహబూబాబాద్ రూరల్ : టిప్పర్ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం సెంటర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కేసముద్రం మండలం బడితండాకు చెందిన భూక్య సేవియా, లలిత దంపతులకు ముగ్గురు కుమారులు భరత్, నవీన్ (22) గణేష్ ఉన్నారు. రెండో కుమారుడు నవీన్ శుభకార్యాల డెకరేషన్లు, ఈవెంట్ ఆర్గనైజింగ్ పనులతోపాటు కూలి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని మూడు కోట్ల సెంటర్ వైపు నుంచి కోర్టు సెంటర్ వైపు బైక్ పై వస్తున్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం సెంటర్ వద్దకు నవీన్ చేరుకుంటుండగా వెనుకనుంచి టిప్పర్ వాహనం అతడిని ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని టిప్పర్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నవీన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం గదికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు.


