బురద అంటకుండానే వరిసాగు.. | - | Sakshi
Sakshi News home page

బురద అంటకుండానే వరిసాగు..

Jun 30 2025 4:25 AM | Updated on Jun 30 2025 4:25 AM

బురద అంటకుండానే వరిసాగు..

బురద అంటకుండానే వరిసాగు..

దుగ్గొండి : వరి సాగులో ప్రస్తుతం పెట్టుబడి పెరగడంతోపాటు కూలీల కొరత రైతులను వేధిస్తోంది. పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ నీరు అవసరం లేకుండానే బురద అంటకుండా అధిక దిగుబడి సాధించేలా వరి సాగు విధానాన్ని శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దమ్ము చేయకుండా నేరుగా దుక్కిలోనే వరి విత్తనాలు వేసి సాగు చేసే విధానాన్ని వరంగల్‌ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త నాగభూషణం వివరించారు.

దుక్కి తయారీ..

పొలాన్ని లేదా మెట్ట భూమిని కల్టివేటర్‌తో మొదట రెండు సార్లు దున్నిన అనంతరం రోటోవేటర్‌తో చ దును చేయాలి. తదనంతరం సీడ్‌ డ్రిల్లర్‌, ఫెర్టికమ్‌ సీడ్‌ డ్రిల్లర్‌ యంత్రంతో విత్తనాలు వేయాలి.

అనువైన రకాలు..

ఉత్తర తెలంగాణ ప్రాంతానికి దీర్ఘకాలిక రకాలైతే సాంబమశూర, సిద్ధి, మధ్య కాలిక రకాలైతే జగిత్యా ల వరి, పోలాస ప్రభ, వరంగల్‌ సన్నాలు, వరంగల్‌ సాంబ, విజేత, భద్రకాళి, స్వల్ప కాలిక రకాలైతే తెలంగాణ సోన, కూనారం సన్నాలు అనుకూలం.

నాటే సమయం..

దీర్ఘకాలిక రకాలైతే జూన్‌ 10 నుంచి 30 వరకు, మధ్యకాలికం జూన్‌ 30 నుంచి జూలై 10 వరకు, స్వల్పకాలికం జూలై 10 నుంచి జూలై 30 వరకు విత్తుకోవచ్చు..

విత్తన మోతాదు..

సన్నగింజ రకాలైతే ఎకరాకు 8 నుంచి 10 కిలోలు, దొడ్డు గింజ రకాలైతే 10 నుంచి 12 కిలోలు సరిపోతాయి. సాలుకు సాలుకు మధ్య 25 సెంటీమీటర్ల, మొక్కకు మొక్కకు మధ్య 6 నుంచి 8 సెంటీమీటర్ల దూరం ఉండాలి.. విత్తనాలను ట్రాక్టర్‌ సాయంతో పనిచేసే సీడ్‌ డ్రిల్లర్‌ లేదా ఫర్టికమ్‌ సీడ్‌ యంత్రం సాయంతో విత్తుకోవాలి.

ఎరువుల యాజమాన్యం..

ఎకరాకు 48 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పోటాష్‌ నిచ్చే ఎరువులు వేయాలి. మొదట 20 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్‌ను ఆఖరి దుక్కిలో వేయాలి. నత్రజని ఎరువును మూడు సమపాళ్లుగా విభజించి విత్తిన 15 నుంచి 20 రోజులకు, పిలక, అంకురం దశల్లో వాడుకోవాలి. చివరి దశలో వేసే నత్రజనితో పాటు 8 కిలోల పోటాష్‌ను తప్పనిసరిగా వేయాలి.

కలుపు నివారణ..

వరిలో 45 రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. కలుపుపై అశ్రద్ధ చేస్తే దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. విత్తిన వెంటనే తేమ ఉన్న సమయంలో 48 గంటలలోపు ఎకరాకు లీటర్‌ పెండిమిథాలిన్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి భూమి తడిచేలా పిచికారీ చేయాలి. 20 రోజుల వయసులో ఎకరాకు బిస్‌పైరిబాక్‌ సోడియం 120 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలి. లేదా వీడర్‌ సాయంతోనూ కలుపును నివారించుకోవచ్చు.

ఇనుపదాతు లోపం..

ఎద పద్ధతిలో సాగుచేసే వరిలో ఇనుపదాతు లోపం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లీటర్‌ నీటికి 5 గ్రాముల అన్నబేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పంటపై 2–3 సార్లు పిచికారీ చేయాలి. చీడపీడల ప్రభావం పెద్దగా ఉండదు. ఉన్నా మామూలు వరిపై పద్ధతులనే పాటించాలి.

నీటి యాజమాన్యం..

తొలకరి వర్షాలు పడగానే వాటిని ఉపయోగించుకుని ఎద పద్ధతి వరిసాగు చేసుకోవడం లాభాదా యకం. తొలకరి వర్షాలకు వరి విత్తనాలు విత్తితే జూ న్‌, జూలై, ఆగస్టు మాసాల వరకు వర్షాలే సరిపోతా యి. ఆ తర్వాత 15 రోజుల వరకు వర్షాలు లేకుంటే ఆరుతండి పంటకు మాదిరిగా నీటి తడులివ్వాలి. పూత దశనుంచి గింజ గట్టిపడేవరకు పొలంలో అంగుళం మేర నీరు ఉండేలా చూసుకోవాలి..

ఖర్చులు.. ఆదాయం..

సాధారణ పద్ధతిలో వరి సాగుకు నారుమడి, విత్త నం, దమ్ము చేయడం, చదునుచేయడం, కూలీ లు, అధిక నీరు ఇలా చాలా పెట్టుబడి అవుతుంది. ఎద పద్ధతిలో అయితే ఎకరాకు రూ. 10 వేల పెట్టుబడి తగ్గుతుంది. దిగుబడి సాధారణం కంటే ఎక్కువే వస్తున్న నేపథ్యంలో ఎకరాకు రూ. 15 వేల అదనపు ఆదాయం సాధ్యమవుతుంది.

దిగుబడి ..

వర్షాకాలంలో ఎకరాకు 35 నుంచి 40 బస్తాలకు తగ్గకుండా దిగుబడి వస్తుంది. సాధారణ పదధతిలోని వరికంటే 3 నుంచి 5 బస్తాల అధిక దిగుబడి వస్తుంది.

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement