
ఒంటరివాడినయ్యాననే మనస్తాపంతో..
● యువకుడి ఆత్మహత్యాయత్నం
● చికిత్స పొందుతూ మృతి
గార్ల: ఒంటరి వాడినయ్యాననే మనస్తాపంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గార్ల మండల కేంద్రంలోని కొలిమికొట్టం బజారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొలిమికొట్టం బజారుకు చెందిన రుద్ర ప్రశాంత్ (22) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మమ్మ ఉపేంద్రమ్మ వద్ద పెరిగి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గతేడాది అమ్మమ్మ కూడా చనిపోవడంతో హైదరాబాద్‌లో పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈనెల 15న అమ్మమ్మ సంవత్సరీకం సందర్భంగా గార్ల వచ్చాడు. బంధువులతో కలిసి కార్యక్రమం పూర్తి చేశాడు. బంధువులందరూ వెళ్లిపోయాక ఒంటరిగా ఉన్నాడు. అమ్మ, నాన్న, అమ్మమ్మ చనిపోయారని, దీంతో ఒంటరిగా ఉంటున్నానని మనస్తాపం చెంది ఈనెల 18న పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు గమనించి వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి అన్న జశ్వంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రవీందర్ తెలిపారు.
డోర్నకల్‌లో విషాదం
● కర్ణాటకలో గ్రామ యువకుడి అనుమానాస్పద మృతి
డోర్నకల్: డోర్నకల్‌లో విషాదం నెలకొంది. స్థానిక బంకట్‌సింగ్‌తండాకు చెందిన ఓ యువకుడు కర్ణాటకలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. తండాకు చెందిన ఆర్పీఎఫ్ ఎస్సై జాటోత్ సామ్యేల్ దేవరాజ్ కుమారుడు రాజ్‌కుమార్(26) కర్ణాటకలోని బెల్గావి జిల్లా కాగర్‌వాట్‌లోని సెంట్రల్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తూ బెల్గావిలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 26న ఉదయం తన గదిలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీలో భద్రపర్చి కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపారు. కుటుంబ సభ్యులు శనివారం రాజ్‌కుమార్ మృతదేహాన్ని డోర్నకల్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఉన్నత ఉద్యోగం చేస్తూ అందరితో కలిసి ఉండే రాజ్‌కుమార్ మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది.

ఒంటరివాడినయ్యాననే మనస్తాపంతో..