విత్తనాలు అందించడంలో చేతులెత్తేసిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

విత్తనాలు అందించడంలో చేతులెత్తేసిన ప్రభుత్వం

Jun 15 2026 1:47 AM | Updated on Jun 15 2026 1:47 AM

ఉమ్మడి జిల్లాలోని వివిధ

మండలాల్లో నమోదైన

వర్షపాతం వివరాలు

వర్షాలు కురుస్తున్నా... రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. వేరుశనగ, కంది విత్తుకోవడానికి చక్కటి అదను అయినప్పటికీ విత్తనం అందక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా అవసరాలకు వేరుశనగ విత్తనం కాయలను కడప నుంచి తెప్పిస్తున్నారు. వర్షాలతో వాగులు పొంగిపొర్లడంతో పలు మండలాలకు వేరుశనగ చేరని పరిస్థితి ఏర్పడింది. విత్తన పంపిణీపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం రైతులకు శాపంగా మారింది. వేరుశనగ, కంది విత్తనాలు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే దానిపై వ్యవసాయ శాఖకు కూడా సమాచారం లేదు. యూరియా వినియోగాన్ని కట్టడి చేసేందుకు యాప్‌ ద్వారా అమ్మకాలు చేపట్టడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్‌ సమస్యలు వేధిస్తున్నాయి.

ఆలూరు సమీపంలో ఉప్పొంగిన

కట్రవంకవాగు

కర్నూలు(అగ్రికల్చర్‌): నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు వర్షాలు దంచికొట్టాయి. ఒక్క రోజులోనే వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రధాన పట్టణాలు, గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. కర్నూలు జిల్లాలో సగటున 44.8 మి.మీ., నంద్యాల జిల్లాలో 21.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగిలో రికార్డు స్థాయిలో 100.6 మి.మీ.( 10.6 సెం.మీ), సి.బెళగల్‌లో అత్యల్పంగా 16.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లాలోని అన్ని మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, నంద్యాల జిల్లాలో ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కరిశాయి. నంద్యాల జిల్లా బేతంచెర్లలో అత్యధికంగా 77.2 మి.మీ., అత్యల్పంగా శ్రీశైలంలో 1.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. రహదారులు, వంతెనలపై ప్రమాదకరంగా వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు తోడు జిల్లాలోని కోసిగి, ఆలూరు, హొళగుంద, పెద్దకడుబూరు, హాలహర్వి తదితర మండలాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో వాగులు, వంకలు ఏకమయ్యాయి.

ఆదోనిలో లోతట్టు ప్రాంతాలు జలమయం

ఆదోనిలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లంగరుబావి వీధి, మున్సిపల్‌ మెయిన్‌ రోడ్డు, శ్రీనివాసభవన్‌, పరిశాముల్ల ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఆలూరు మండలంలో కురిసిన కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆలూరు–గుంతకల్‌ మధ్య వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. హాలహర్వి మండలంలోని గూళ్యం–సిద్ధాపురం మధ్య వాగులు పెద్ద ఎత్తున ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మిగనూరు మండలంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి కురిసిన వర్షాలకు కడివెళ్ల సమీపంలోని కప్పలవాగుకు భారీగా వరద నీరు చేరి పొంగిపొర్లడంతో ఎమ్మిగనూరు– పత్తికొండ పట్టణాల మధ్య రవాణా స్తంభించిపోయింది. గోనెగండ్ల మండలం గంజిహళ్లి, అగ్రహారం గ్రామాల మధ్య వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలూరు– చిప్పగిరి మధ్య కళ్లెవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గుంతకల్‌– చిప్పగిరి మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదోని–గుంతకల్‌ మధ్య ఉన్న వంతెనలపై ఉధృతంగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కౌతాళం మండలంలో ఒకవైపు వర్షాలు, ఈదురు గాలులతో విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

మండలం కురిసిన వర్షం

(మి.మీ.లలో)

కోసిగి 100.6

ఆలూరు 95.2

బేతంచెర్ల 77.2

హొళగుంద 75.4

పెద్దకడుబూరు 70.4

ఆదోని 62.4

హాలహర్వి 57.6

డోన్‌ 57.0

దేవనకొండ 50.8

మంత్రాలయం 50.2

చిప్పగిరి 50.2

ఆస్పరి 50.0

మద్దికెర 48.8

అవుకు 46.2

పత్తికొండ 45.6

ఎమ్మిగనూరు 44.6

చాగలమర్రి 43.2

తుగ్గలి 42.4

నందవరం 37.4

కౌతాళం 36.0

ప్యాపిలి 35.4

వెల్దుర్తి 34.4

జిల్లాలో పొంగిపొర్లిన వాగులు,

వంకలు

ప్రధాన పట్టణాల మధ్య

స్తంభించిన రాకపోకలు

ఆదోనిలో లోతట్టు ప్రాంతాలు

జలమయం

పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు

అంతరాయం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement