కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్‌లో కూడా సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్‌చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.
శ్రీమఠం.. భక్తజనసంద్రం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. రాయరు దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. తుంగభద్ర నదీతీరంలో భక్తుల కోలాహలం కనిపించింది. మంచాలమ్మకు ప్రత్యేకంగా పూల అలంకరణ చేశారు. మూలబృందావనానికి శ్రీమఠం పీఠాధిపతి శ్రీసుబుధేంద్రతీర్థులు ప్రత్యేక పూజలు చేపట్టి మంగళహారతులు గావించారు. ఆదివారం కురిసిన భారీ వర్షంతో భక్తుల ఇబ్బంది పడకుండా హెచ్‌ఆర్‌బీ కల్యాణ మండపంలో వసతులు కల్పించారు.
నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లపై జాగ్రత్త అవసరం
కర్నూలు (టౌన్): ఇటీవల కాలంలో నకిలీ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లతో మోసం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు ప్రముఖ కంపెనీల పేర్లను పొలి ఉండే నకిలీ వెబ్‌సైట్లను రూపొందించారని తెలిపారు. తక్కువ ధరకు స్కూల్ యూనిఫాంలు, షూస్, ఎలక్త్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు అందిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్ల ద్వారా ముందస్తు డబ్బు తీసుకొని అనంతరం వస్తువులు పంపకుండా, లేదంటే నాసిరకం వస్తువులను పంపించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అధికారిక, విశ్వసనీయ వెబ్‌సైట్లలో మాత్రమే కోనుగోళ్లు చేయాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, సందేశాలను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితో పంచుకోకూడదని తెలిపారు. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడితే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రదించాలన్నారు.
రక్తదానంలో యువత ఆదర్శంగా నిలవాలి
కర్నూలు(హాస్పిటల్): రక్తదానంలో యువత ఆదర్శంగా నిలవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ధన్వంతరి హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని బ్లడ్‌బ్యాంక్ రాష్ట్రంలోనే అత్యధిక సేవలు అందించిందని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ ఎల్.భాస్కర్ తెలిపారు. అనంతరం రక్తదానం చేస్తున్న యువకులు, వారిని ప్రోత్సహిస్తున్న వారికి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ప్రశంసాపత్రాలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పాథాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ బాలీశ్వరి, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ అలీ హైదర్, రక్తకేంద్ర వైద్యులు షెహనాజ్, రవికాంత్, నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రిబాయి పాల్గొన్నారు.


