నేటి నుంచి ఇంటింటా ‘సర్‌’ సర్వే | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంటింటా ‘సర్‌’ సర్వే

Jun 15 2026 1:47 AM | Updated on Jun 15 2026 1:47 AM

ప్రజలు సహకరించాలి

ఏర్పాట్లు పూర్తి చేసిన

జిల్లా ఎన్నికల సంఘం

కర్నూలు(సెంట్రల్‌): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో సోమవారం నుంచి స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) సర్వే ప్రారంభం కానున్నది. ఈ మేరకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ‘సర్‌’ సర్వేలో పాల్గొనే బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌(బీఎల్‌ఓలు), బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఎన్యుమరేషన్‌ ఫామ్‌లను అన్ని నియోజకవర్గాలకు పంపింది. సర్వేలో భాగంగా ఒక్కో కుటుంబాన్ని బీఎల్‌ఓలు కనీసం మూడు సార్లు సందర్శించి వివరాలు సేకరించాలి. ఎన్నికల సంఘం ఇచ్చిన ఎన్యుమరేషన్‌ ఫా మ్‌ను ప్రతి ఓటరు కచ్చితంగా పూరించి ఏదైనా గుర్తింపు కార్డుతోపాటు అందజేస్తేనే ఓటరు జాబితాలో పేరు ఉంటుంది.

ఓటరుకే పరీక్ష!

కర్నూలు జిల్లాలో 2026 మార్చి 31వ తేదీ నాటికి 20,83,327 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 10,25,735 మంది పురుషులు, 10,57,272 మంది మహిళలు, 320 మంది ఇతరులు, 122 మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారు. వీరంతా ఎవరికీ వారు ఓటర్లుగా ఉన్నట్లు రుజువు చేసుకోవాల్సి ఉంది. 2002, 2025 ఓటరు జాబితాలను పోల్చి చూస్తారు. ప్రస్తుతం 2025 జాబితాలో ఓటరుగా ఉన్నా వారి ఆనవాళ్లను 2002 జాబితాలోని వారి తాతలు, అవ్వలు, అమ్మలు, నాన్నల వివరాలను పోల్చి చూస్తారు. 2002 జాబితా ఆనవాళ్లు లేకపోతే వారిని ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియకు దూరంగా ఉంచి తొలగించే ప్రయత్నం చేస్తారు.

షెడ్యూల్‌..

● జూన్‌ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్‌ఓలు ఇంటింటా తిరిగి ఎన్యుమరేషన్‌ ఫామ్‌–2ను ఇచ్చి దానిని పూరించుకొని తిరిగి తీసుకుంటారు.

● ఇదే సమయంలో పోలింగ్‌ కేంద్రాల పునర్‌ వ్యవస్థీకరణ కూడా జరుగుతుంది.

● జూలై 1వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటరు వివరాలను పరిశీలన చేస్తారు.

● జూలై 21న ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు.

● అప్పటి నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు దానిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.

● జూలై21 నుంచి సెప్టెంబర్‌ 18వ తేదీ వరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కారం చేస్తారు.

● సెప్టెంబర్‌ 22న తుది ఓటరుజాబితా ప్రకటిస్తారు.

జిల్లాలో జూన్‌ 15 నుంచి సర్‌ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ప్రతి ఓటరు ఎన్యుమరేషన్‌ఫామ్‌–2ను పూరించి ఇవ్వాలి. దాని ఆధారంగానే ఓటరు జాబితాలో పేర్లు నమోదు అవుతాయి. 2026 జూలై 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. ఓటు అనేది భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కు. దానిని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి.

– డాక్టర్‌ ఏ.సిరి, కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement