అక్రమ కేసులకు భయపడేది లేదు
● అరెస్ట్, బెయిల్ మంజూరు ● అక్రమ కేసులపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే కాటసాని
కర్నూలు (టౌన్): చిన్నపాటి గొడవలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 26వ వార్డు తాజా మాజీ కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే సంఘటనకు సంబంధించిన పూర్వపరాలు పరిశీలించిన జడ్డి బెయిల్ మంజూరు చేశారు. వివరాల మేరకు.. కర్నూలు కృష్ణనగర్‌లోని వార్డు పరిధిలోకి వచ్చే విఠల్ నగర్ సవారి తోట వద్ద ఓ రోడ్డు విషయంలో దాదాపు నెలన్నర క్రితం స్థానిక టీడీపీ అనుచరుడుతో చిన్న పాటి గొడవ జరిగింది. రోడ్డును ఆక్రమించి ఇళ్లు కడుతున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న లక్ష్మీకాంత రెడ్డి పనులు నిలిపివేయాలని కోరారు. ఇదే విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది జరిగి దాదాపు 48 రోజులవుతోంది. టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకు అప్పట్లో కార్పొరేటర్, స్థానికుడి మల్లికార్జున ఇరువురిపై కేసులు నమోదు చేశారు. అయితే ఇన్ని రోజలు పట్టించుకోని పోలీసులు శనివారం అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉదయం ఇరువురిని స్టేషన్‌కు పిలిపించి అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అన్ని పరీక్షలు చేశారు. ఇద్దరిని జడ్జి అపర్ణ ఎదుట హాజరు పరిచారు. జడ్జి అన్నంటిని క్షుణంగా పరిశీలించి బెయిల్ మంజూరు చేశారు. అనంతరం ఇద్దరు కల్లూరులోని నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిని కలిశారు. కాగా లక్ష్మీకాంత రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటసానికి ముఖ్య అనుచరుడుగా కొనసాగుతున్నారు. వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పాల్గొంటున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతోనే టీడీపీ నేతలు అతనిపై కక్ష గట్టారని, నెలన్నర క్రితం జరిగిన సంఘటనను సాకుగా చూపుతూ పోలీసులతో అరెస్ట్ చేయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వైఎస్సార్‌సీపీలో బలమైన నాయకులను టార్గెట్ చేసుకొని అరెస్టులు చేయిస్తున్నారు. టీడీపీ నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతూ వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేయడం తగదు. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడేది లేదని టీడీపీ నాయకులు తెలుసుకోవాలి.
– మాజీ ఎమ్మెల్యే కాటసాని


