ఆత్మకూరురూరల్: కొట్టాల చెర్వు చెంచు గూడెంకు చెందిన నాగమణికి చిన్నతనంలోనే తల్లిదండ్రి అనారోగ్యంతో మరణించారు. అనాథ అయిన నాగమణిని బంధువులు పెంచి పెద్ద చేశారే కానీ.. పెళ్లి చేసేంత స్థోమత వారికి లేదు. ఆమెకు ఇటీవల వివాహం కుదిరింది. అయితే పెళ్లికి కనీస ఖర్చులకు కూడా డబ్బుల్లేవు. ఈ విషయం తెలుసుకున్న ఇందిరేశ్వరం అటవీ సెక్షన్ ఎఫ్‌ఎస్‌ఓ మహబూబ్‌బాషా తన వంతుగా సహా యం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేర కు శనివారం ఆయన కొట్టాలచెర్వుకు వెళ్లి నాగమణికి రూ. 5 వేలు, ఒక బియ్యం ప్యాకెట్ ఉడతా భక్తిగా అందించారు. చెంచు యువతి వివాహానికి దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ఫారెస్ట్ అధికారి మహబూబ్ బాషా కోరారు.
అదుపు తప్పిన ట్రాక్టర్
సంజామల: రామభద్రునిపల్లె గ్రామ సమీపంలో శనివారం అదుపుతప్పిన ట్రాక్టర్ కల్వర్టులోకి దూసుకెళ్లింది. పేరుసోముల గ్రామానికి చెందిన షరీఫ్ ట్రాక్టర్‌లో నాపరాళ్ల లోడును సంజామలలో అన్‌లోడ్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా రామభద్రునిపల్లె సమీపంలో అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రెండు లారీలు ఢీ..
ఇద్దరికి గాయాలు
హాలహర్వి: రెండు లారీలు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన హాలహర్వి సమీపంలోని క్షేత్రగుడి దగ్గర శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని నుంచి సిమెంట్ లోడు వేసుకుని ఒక లారీ బళ్లారికి వెళ్తోంది. బళ్లారి నుంచి ఐరన్ వేసుకుని మరొక లారీ హాలహర్వికి వస్తోంది. రెండు లారీలు హాలహర్వి సమీపంలోని క్షేత్రగుడి దగ్గర ఎదురెదురగా ఢీకొన్నాయి. ఇద్దరు లారీ డ్రైవర్లు ఉమేష్ కుమార్, జగదీష్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బళ్లారి ఆసుపత్రికి తరలించారు. హాలహర్వి ఎస్‌ఐ ఈశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు.


