కర్నూలు(టౌన్): వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు, సబ్సిడీలు, ప్రభుత్వ పథకాల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పథకాల పేరుతో నకిలీ సందేశాలు, ఫోన్ కాల్స్, వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, లింకుల ద్వారా రైతుల వ్యక్తిగత, బ్యాంకు వివరాలను సేకరించే ప్రయత్నాలు చేస్తారన్నారు. లైసెన్స్ పొందిన డీలర్లు గుర్తింపు పొందిన దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాల కొనుగోలు, నమోదు ప్రక్రియకు డి–క్రిషి యాప్‌ను మాత్రమే వినియోగించాలని, ఎరువుల కొనుగోలుకు అమలులో ఉన్న ఏపీఏఐఎంఎస్ విధానాన్ని మాత్రమే ఉపయోగించాలన్నారు. అనధికార యాప్‌లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ద్వారా వచ్చే సందేశాలను నమ్మవద్దని హెచ్చరించారు.
కర్నూలు(సెంట్రల్): జిల్లా అధికారులు ఒక్క రోజు ప్రచారంపై చూపుతున్న శ్రద్ధ దైనందిన జీవితంలో చూపకపోవడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంధన పొదుపు పేరిట జిల్లా అధికార యంత్రాంగం శుక్రవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తుగ్గలిలో నిర్వహించిన ఒక్క నెల–ఒక్క నియోజకవర్గం–నాలుగు పర్యటలు కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులు ఎవరికి వారు కార్లలో వెళ్లకుండా ఒకే ఆర్టీసీ బస్సులో వెళ్లారు. కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులంతా వెళ్లడంతో ఆర్టీసీ బస్సు కిక్కిరిసింది. ఇదిలాఉంటే అంత దూరం బస్సులో ప్రయాణించిన అధికారులు.. సమీపంలోని కలెక్టరేట్‌కు వెళ్లేందుకు సైతం కార్లను ఉపయోగించడం పరిపాటిగా మారింది. ప్రజలకు ఆదర్శంగా నిలవాలని భావించినప్పు డు ఏదో ఒక రోజు కాకుండా దైనందిన జీవితంలోనూ పాటించి చూపినప్పుడే పొదుపు సాధ్య మనే అభిప్రాయం వ్యక్తమైంది. కాలి నడకన వెళ్లగలిగే ప్రాంతాలకు సైతం కార్లనే ఆశ్రయిస్తున్న అధికారులను ప్రతిరోజూ గమనిస్తున్న ప్రజలు ఇదేమి చోద్యమని నవ్వుకోవడం కనిపించింది.
ఆర్‌యూ నుంచి ఇద్దరు విద్యార్థుల బహిష్కరణ
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఇద్దరు విద్యార్థులను బహిష్కరిస్తూ వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వర్సిటీ కళాశాలలో తెలుగు పీజీ నాల్గవ సెమిస్టర్ చదువుతున్న ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.శరత్‌కుమార్‌ను వర్సిటీ నుంచి బహిష్కరించారు. వర్సిటీ అధికారులపై నిందలు వేయడం, వర్సిటీ కళాశాల గురించి తప్పుడు ప్రచారాలకు పాల్పడటం, ఎలాంటి ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే కారణాలతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వర్సిటీ నుంచి బహిష్కరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో విద్యార్థి వర్సిటీ కళాశాలలో ఇంగ్లిష్ పీజీ నాల్గవ సెమిస్టర్ చదువుతున్న రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్(ఆర్‌పీఎస్‌ఎఫ్) జిల్లా అధ్యక్షులు బి.నాగరాజును వర్సిటీ నుంచి బహిష్కరించారు. ఇతను క్రమశిక్షణ లేని ప్రవర్తనతో ప్రవర్తించాడని, వర్సిటీ అధికారులతో అసభ్య పదజాలం వాడుతూ వాగ్వివాదానికి దిగాడనే కారణాలతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వర్సిటీ నుంచి బహిష్కరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు.
150 ఎకరాల్లో మల్బరీ సాగు లక్ష్యం
కర్నూలు(అగ్రికల్చర్): 2026–27లో జిల్లాలో 150 ఎకరాల్లో మల్బరీ సాగు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మల్బరీ మొక్కలు నాటుకోవడానికి ఎకరాకు యూనిట్ కాస్ట్ రూ.45 వేలు ఉండగా.. ఎస్సీ, ఎస్టీలకు రూ.40,500, ఇతరులకు రూ.33,750 సబ్సిడీ ఉంటుందన్నారు. జిల్లాకు 10 షెడ్లు మంజూరయ్యాయని, యూనిట్ కాస్ట్ రూ.4.50 లక్షలు ఉండగా.. ఎస్సీ, ఎస్టీలకు రూ.4.05 లక్షలు, ఇతరులకు 3,37,500 సబ్సిడీ లభిస్తుందన్నారు. రేరింగ్ ఎక్విప్‌మెంట్ యూనిట్ కాస్ట్ రూ.75వేలు ఉండగా.. ఎస్సీ, ఎస్టీలకు రూ.67,500, ఇతరులకు రూ.56,250 ప్రకారం సబ్సిడీ వర్తిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద మల్బరీ మొక్కలు నాటుకునేందుకు ఎకరాకు రూ.87021 లభిస్తుందని, ఈ మొత్తం మూడేళ్లలో ప్రతి ఏటా రూ.29,007 ప్రకారం చెల్లిస్తామన్నారు. ఆసక్తి ఉన్న రైతులను గుర్తించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు.


