కర్నూలు(అర్బన్): బాలలతో పనిచేయించుకోవడం, పనిలోకి అనుమంతించడం పూర్తిగా నిషేధమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. జాతీయ, రాష్ట్ర సేవాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి సూచనల మేరకు శుక్రవారం స్థానిక న్యాయ సేవాసదన్‌లో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘించి బాలలతో పనిచేయించుకుంటే ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష తప్పదన్నారు. పారా లీగల్ వలంటీర్లు పిల్లలు పాఠశాలలకు వెళ్లేలా కృషి చేయాలన్నారు. కార్మిక శాఖ అధికారి కేశన్న మాట్లాడుతూ బాల బాలికలతో షాపులు, ఫ్యాక్టరీల్లో పనిచేయించుకోవడం నేరమన్నారు. డీసీపీఓ టి.శారద మాట్లాడుతూ ఎవరికై నా బాల కార్మికులు కనిపిస్తే 1098 లేదా లీగల్ సర్వీసెస్ హెల్త్ లైన్ నెంబర్ 15100కు కాల్ చేసి సమాచారాన్ని అందించాలన్నారు. ఎన్‌జీఓ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల అంతా నగరంలో పర్యటించి బాల కార్మికులను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలకు వెళ్లేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే న్యాయ సేవాసదన్ నుంచి కొండారెడ్డిబురుజు వరకు ర్యాలీ నిర్వహించారు.


