కర్నూలు (టౌన్): స్వయం ఉపాధి ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తుందని, మహిళలు స్వయం సమృద్ధి, సాధికారత సాధించాలని కర్నూలు డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్వేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం కర్నూలు డయాసిస్ సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్లు, అల్లికలకు సంబంధించి స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 150 మంది పేద, గ్రామీణ మహిళలకు బిషప్ కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా, వెన్నెముకగా ఉండాలన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, పేద గృహిణులకు స్వయం ఉపాధి అవకాశాలు కొండంత ఆసరానిస్తాయని, జీవితాలలో భరోసా నింపుతాయన్నారు. కేడీఎస్‌ఎస్‌ఎస్ డైరెక్టర్ ఫాదర్ తోట జోసెఫ్, చిన్నపరెడ్డి, సిస్టర్లు కస్తూరి, విజయ, కేడీఎస్‌ఎస్‌ఎస్ సిబ్బంది ఆరోగ్య, మేరి జోసెఫ్, మోజెస్ తదితరులు పాల్గొన్నారు.


