రూ.51కే బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సిమ్‌ | - | Sakshi
Sakshi News home page

రూ.51కే బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సిమ్‌

Jun 13 2026 7:32 AM | Updated on Jun 13 2026 7:32 AM

రూ.51కే బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సిమ్‌

కర్నూలు(హాస్పిటల్‌): స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సర్వీసులను అతి తక్కువ ధరలో ప్రజలకు చేరువ చేయడానికి ప్లాన్‌ ఎఫ్‌ఆర్‌సీ 51ను ప్రవేశపెట్టినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ కర్నూలు బిజినెస్‌ ఏరియా ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ జి.రమేష్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రీమియం నంబర్లను ఈ–వేలం ద్వారా పొందవచ్చన్నారు. ప్రీమియం నంబర్లు పొందేందుకు http://eauction.bsnl.co.in వెబ్‌సైట్‌లో మొబైల్‌ నంబర్‌ గాని, ఈ మెయిల్‌ ఐడీ ద్వారా కానీ రిజిస్టర్‌ చేసుకుని కావాల్సిన నంబర్‌ను రిజర్వ్‌ చేసుకోవచ్చని తెలిపారు. పిన్‌ జనరేట్‌ అయిన తర్వాత దగ్గర్లోని వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించి బిడ్‌ అమౌంట్‌ చెల్లించి సిమ్‌ను పొందవచ్చన్నారు. ఈ–వేలం విండో జూన్‌ 15వ తేదీ వరకు ఉంటుందన్నారు.

రూ.899కే అధిక స్పీడ్‌తో ఇంటర్నెట్‌

కేవలం రూ.899కే 175 ఎంబీపీఎస్‌తో 5 వేల జీబీ వరకు ఇంటర్నెట్‌,అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యాలతో కొత్త ఎఫ్‌టీహెచ్‌ ప్లాన్‌ ఫైబర్‌ వాల్యూ అడ్వాన్స్‌ను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఇంటర్నెట్‌ సౌకర్యం, జియో హాట్‌స్టార్‌ సూపర్‌ప్లాన్‌, సోనీ లైవ్‌, జీ5, హంగామా యాప్‌, లయన్స్‌గేట్‌, షిమారో మీ, ఎపిక్‌ ఆన్‌ ఓటీటీలు ఉంటాయన్నారు. అతి తక్కువగా రూ.220కే ఫైబర్‌ టీవీ బేసిక్‌ ప్లాన్‌ ద్వారా 20 ఎంబీపీఎస్‌ స్పీడుతో 500 జీబీ వరకు ఇంటర్నెట్‌, రూ.140 రీచార్జ్‌ చేసుకోవడం ద్వారా టీవీ ఛానళ్లు, ఓటీటీలు వీక్షించవచ్చని వెల్లడించారు.

వాహన దొంగల ముఠాలో విరుపాపురం వాసి?

ఆలూరు: ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో

బైక్‌లు, బొలెరోలు, ప్రొక్లెయినర్‌లను అపహరించిన ముఠాలో హాలహర్వి మండలం విరుపాపు రానికి చెందిన చెన్నబసప్పను కర్ణాటక పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇతను 20 ఏళ్ల క్రితం కర్ణాటకలోని చెలగనూరుకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. కర్ణాటకలోని బళ్లారి, సింధనూరు, శిరుగుప్ప ప్రాంతాల్లో బైక్‌లు అపహరించి ఆంధ్రలోని హాలహర్వి మండలం విరుపాపురం గ్రామంలో బైక్‌ మెకానిక్‌ లతీఫ్‌, జీరా చెన్న తదితరుల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. దీనిపై సమగ్ర విచారణ జరిపిన కర్ణాటక పోలీసులు నిందితుడు చెన్నబసప్పను అరెస్టు చేసి, హాలహర్వి మండలంలోని లతీఫ్‌, జీరా చెన్న వద్ద విచారణ జరిపారు. స్థానికంగా వారు విక్రయించిన దాదాపు 50 బైక్‌లను మూడు రోజులు క్రితం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై హాలహర్వి ఎస్‌ఐ ఈశ్వరరావును శుక్రవారం విచారించగా మోటార్‌ వాహనాల అపహరణ కేసులో కర్ణాటక పోలీసులు హాలహర్వి మండలంలో విచారణ జరుపుతున్న విషయం వాస్తవమేనని వెల్లడించారు.

18న వైద్యుల పోస్టులకు

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

కర్నూలు(హాస్పిటల్‌): డిస్ట్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌(డీసీహెచ్‌ఎస్‌), ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ ఆసుపత్రుల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్టు(10), సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌(6) పోస్టులకు ఈ నెల 18న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ జఫ్రుల్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టు ప్రాతిపదిక భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికై న వారికి సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్టుకు నెలకు జీతం రూ.1,10,000, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌కు రూ.61,960జీతం ఇస్తారన్నారు. వివరాలుకు kurnool.ap.gov.in, nandyal.ap. gov.in వెబ్‌సైట్‌లలో చూడాలన్నారు.

హైస్కూల్లో నాగుపాము

కోడుమూరు రూరల్‌: పాఠశాలలు పునఃప్రారంభమైన వేళ కోడు మూరు మండలంలోని కల్లపరి హైస్కూల్లో ఆరడు గుల నాగుపాము ప్రత్యక్షమైంది. వంట ఏజెన్సీ మహిళలు భోజనం తయారు చేసేందుకు పాఠశాల వంటగదిలోకి వెళ్లగా బియ్యం సంచుల మాటున పాము తిష్ట వేసి ఉంది. గమనించిన మహిళలు పరుగున బయటకు వచ్చి విషయాన్ని హెచ్‌ఎం శాంతమూర్తికి తెలిపారు. పులకుర్తి గ్రామంలో పాములపట్టే వ్యక్తిని హెచ్‌ఎం పిలిపించి పామును పట్టించడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు పీల్చుకున్నారు. ప్రహరీ లేకపోవడంతో చుట్టు పక్కల పొలాల నుంచి పాములు పాఠశాలలోకి వస్తున్నాయని, వెంటనే పాఠశాలకు కాంపౌండ్‌ వాల్‌ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇరువర్గాల ఘర్షణ

బేతంచెర్ల: మండలంలోని బుగ్గానిపల్లె సర్వే నంబర్‌ 827లోని రెండు ఎకరాల భూమి విషయమై తమదంటే తమదంటూ ఇరువర్గాలు ఘర్షణకు దిగిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సదరు సర్వే నంబర్‌ పక్కన పట్టణానికి చెందిన ఓ వ్యక్తి క్రషర్‌ నిర్వహిస్తున్నారు. క్రషర్‌ పక్కనే ఉన్న భూమికి సంబంధించి 2010లో కొలుములపల్లెకు చెందిన కొందరికి డీ–పట్టా ఇవ్వడంతో వారు అక్కడ చీని చెట్లు నాటారు. అయితే, తమ పొలంలో చెట్లు ఎలా నాటుతారంటూ 2024లో డీ–పట్టా పొందిన క్రషర్‌ యజమాని ఆ చెట్లను తొలగించారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ విషయమై తహసీల్దార్‌ నాగమణిని వివరణ కోరగా.. సదరు సర్వే నంబర్‌లో 2010లో ఒకరికి, మళ్లీ అదే నంబర్‌లో 2024లో మరొకరికి పట్టా ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ పొలాన్ని ఎవరూ సాగు చేయలేదని, ఆన్‌లైన్‌లోనూ ఎవరి పేరూ లేదని పేర్కొన్నారు. రీ–సర్వేలో ఈ సర్వే నంబర్‌లోని 15 ఎకరాలను ప్రభుత్వ భూమిగా గుర్తించినట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement