కర్నూలు(టౌన్): ఆర్మ్‌డ్ రిజర్వులో ఆర్‌ఎస్‌ఐలుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల సివిల్ ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన వారు మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. శుక్రవారం కన్వర్షన్ కింద ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన సివిల్ ఎస్‌ఐలు కర్నూలు రేంజ్ డీఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు. డీఐజీ మాట్లాడుతూ ప్రజలకు సత్వర న్యాయం అందించే విధంగా పోలీసులు కృషి చేయాలన్నారు. క్రమశిక్షణ, నిజాయితీ, అంకిత భావంతో పనిచేస్తూ శాఖ ప్రతిష్టను పెంచాలన్నారు.
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమానికి వైద్యులు, సిబ్బంది సిద్ధం కావాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ తెలిపారు. కర్నూలు మెడికల్ కాలేజిలోని ఆడిటోరియంలో పల్స్‌పోలియో కార్యక్రమంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ 2003 అక్టోబర్ నెల 13న జిల్లాలో చివరి పోలియో కేసు నమోదైందన్నారు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, అయినా ముందు జాగ్రత్త చర్యగా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 3,52,164 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు వేస్తామన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమ మాట్లాడుతూ మొత్తం 1,630 బూత్‌లలో పోలియో చుక్కలు వేస్తారన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. 29, 30వ తేదిల్లో ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్క పిల్లవాడికి పల్స్‌పోలియో చుక్కలు వేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్, సంచార చికిత్స కార్యక్రమ నోడల్ అధికారి డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి, డీపీఎంఓ డాక్టర్ శైలేష్‌కుమార్, డీపీఓ విజయరాజు పాల్గొన్నారు.


