కర్నూలు సిటీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ (ట్రిపుల్‌ఐటీ డీఎం) సంస్థ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహించారు. రెండో రోజు శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రిపుల్‌ఐటీ డీఎం డైరెక్టర్ ఆచార్య బీఎస్ మూర్తి అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సదస్సులు పరిశోధకులు, విద్యార్థుల మద్య విజ్ఞాన మార్పిడి, పరస్పర సహకారం పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. శాసీ్త్రయ రంగాలల్లో పరిశోధన, ఆవిష్కరణల గురించి వివరించారు. సదస్సు చైర్మన్, సైన్సెస్ విభాగాధిపతి పాండియరాజన్ మాట్లాడారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర విశ్వవిద్యాయాలు, సీఎస్‌ఐఆర్ ప్రయోగశాలలకు చెందిన 15 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, నిపుణులు ఆహ్వానిత ఉపన్యాసకులుగా పాల్గొని, ఆధునాతన పదార్థాల రంగంలో తాజా పరిశోధన, పురోగతులు, అభివృద్ధి చెందుతున్న ధోరణులు, స్థిరమైన సాంకేతికతలలో వాటి వినియోగాలపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. కన్వీనర్లు డాక్టర్ పవన్ ప్రకాష్, డాక్టర్ కిశోర్ మాట్లాడుతూ సదస్సు నిర్వహణకు భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ, సీఎస్‌ఐఆర్, ఐఐఐటీడీఎం నుంచి ఆర్థిక, సంస్థాగత సహకారం లభించిందన్నారు. ఆంఽధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 70 మంది పరిశోధక విద్యార్థులు, పీజీ, యూజీ విద్యార్థులు పాల్గొన్నారు.


