వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jun 13 2026 7:32 AM | Updated on Jun 13 2026 7:32 AM

కొలిమిగుండ్ల: మండల పరిధిలోని బెలుంకు చెందిన కవిత (24) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంజామల మండలం గిద్దలూరుకు చెందిన కవితకు బెలుంకు చెందిన బంధువు నరసింహులుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం ఉన్నారు. భర్త ట్రాక్టర్‌ డ్రైవర్‌ పని చేస్తుంటాడు. ఉదయం దంపతుల మధ్య కుటుంబ సమస్యల వల్ల గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కవిత ఇంట్లో ఉన్న పేడ రంగును నీళ్లలో కలుపుకొని తాగింది. తర్వాత వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం బనగానపల్లెకు అక్కడి నుంచి కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

రైలు కిందపడి యువతి ఆత్మహత్య

ఆదోని సెంట్రల్‌: ఆదోని పట్టణానికి చెందిన బోగనూర్‌ అబ్దుల్‌ రఫూఫ్‌ కుమార్తె బోగనూర్‌ నజియా బాను శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదోని– మంత్రాలయం రైల్వే పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ సి.శివరామయ్య తెలిపారు. వివరాలు.. నజియా బానుకు ఇష్టం లేని పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపం చెంది ఆదోని రైల్వే స్టేషన్‌ సమీపంలో రాయచూరు నుంచి గుత్తికి వెళ్లే గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని వివరించారు. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement