● రూ.4 లక్షలు నష్టం
గోనెగండ్ల: మండలంలోని ఐరన్‌బండ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున వీధికుక్కల దాడిలో 44 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వివరాలు.. ఐరన్‌బండ గ్రామానికి చెందిన బజారి, చంద్ర, రమేష్ గొర్రెల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండలో శని, ఆది, సోమవారాల్లో గొర్రెల వ్యాపారం చేసేందుకు ముగ్గురు వ్యాపారులు గురువారం తెలంగాణలోని పెబ్బేరు సంతకు వెళ్లి రూ.4 లక్షలతో గొర్రెలను కోనుగోలు చేసి రాత్రి ఐరన్‌బండ గ్రామంలో నిర్మాణంలో ఉన్న పంచాయతీ కార్యాలయం భవనంలో వాటిని ఉంచారు. కార్యాలయం నిర్మాణంలో ఉండటంతో గదులకు తలుపులు లేవు. గేటు వద్ద తడికను అడ్డంగా పెట్టి రాత్రి ఇళ్లకు వెళ్లారు. తెల్లవారుజామున గొర్రెలను గుర్తించిన దాదాపు 10 వీధికుక్కలు వాటిపై దాడి చేసి కొరికి చంపాయి. ఆ సమయంలో గొర్రెలు అరవడంతో సమీపంలోని వచ్చి చూడగా అప్పటికే గొర్రెలు మృతిచెందాయి. విషయం తెలుసుకుని వ్యాపారులు బజారి, చంద్ర, రమేష్ కన్నీటి పర్యంతం అయ్యారు. అప్పులు చేసి గొర్రెలను కొని తెచ్చామని, రూ.4 లక్షలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.


