గత ఏడాది వానాకాలం వర్షపాతం (మి.మీ.ల్లో)
పత్తి సాగుకు అడుగులు
ఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంటల సాగుపై అన్నదాతల్లో అయోమయం నెలకొంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. పంటలకు అవసరమైన ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం తక్కువగా నమోదవుతుందని వెల్లడించగా.. రాష్ట్ర ప్రభుత్వం రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా వ్యవసాయ శాఖ ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికే వానాకాలం సీజన్ మొదలైనందున అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
ఏడు లక్షల ఎకరాల్లో సాగు అంచనా
జిల్లాలో ఈ ఏడాది అన్ని పంటలు కలిపి 7 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అధికారులు తొలుత అంచనా వేశారు. ఇందులో ప్రధాన పంటగా వరి దాదాపు 3.20 లక్షల ఎకరాల్లో, ఆ ఆర్వాత 2.69 లక్షల ఎకరాల్లో పత్తి, లక్ష ఎకరాల మేర మిర్చి సాగు చేస్తారని భావించారు. అయితే, ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువ కురవనున్న నేపథ్యాన నీటి వినియోగం అధికంగా ఉండే వరి, పత్తికి బదులు పెసర, మినుము, కంది, జొన్న, వేరుశనగ వంటి పంటలు సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నేల స్వభావం వరికి మాత్రమే అనుకూలంగా ఉంటే స్వల్పకాలిక రకాలను, వెదజల్లే సాగు చేసుకోవాలని చెబుతున్నారు. అంతేకాక పత్తిలో అధిక సాంద్రత విధానాన్ని అవలంబించాలని సూచిస్తున్నారు.
వనరులపై ఆశలు
అధికారులు అవగాహన కల్పిస్తున్నా రైతులు మాత్రం జిల్లాలోని నీటి వనరులపై ఆశగా ఉన్నారు. జిల్లాకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన నీటి వనరుగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా నీరు విడుదలైతే జిల్లాలోని జలాశయాల్లోకి సమృద్ధిగా నీరు చేరడమే కాక భూగర్భ జలాలు సైతం పెరుగుతాయి. రెండేళ్లుగా విస్తారంగా కురిసిన వర్షాలకు పలు జలాశయాల్లో ఇప్పటికే సమృద్ధిగా నీరు ఉంది. దీనికి తోడు అరకొరగా వర్షాలు కురిసినా పంటల సాగుకు నీరు సరిపోతుందని రైతులు భావిస్తున్నారు. కాగా, జిల్లాలో ఈ నెల 11 నాటికి సాధారణ వర్షపాతం 34.4 మి.మీలు కాగా అంతకు మించి 63.3 మి.మీ.లుగా నమోదైంది. కానీ ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వర్షాలు లేక, పంటలకు అవసరమైన ఆగస్టు, సెప్టెంబర్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు.
పత్తి సాగుకు ప్రస్తుతమైతే దుక్కులు చేస్తున్నాం. కానీ వర్షాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అదే జరిగితే నష్టపోతామని భయం ఉంది. మాగాణి భూముల్లో వానాకాలం ఆరుతడి పంటలు పండవు. జలాశయాల్లో నీరు చేరితే వరి సాగు చేస్తా.
–సోమనబోయిన వెంకటేశ్వర్లు, రైతు, తెట్టెలపాడు
ఎల్‌నినో ప్రభావం నేపథ్యాన ప్రత్యామ్నాయ పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలి. వాతావరణం, నీటి వనరులకు అనుగుణంగా తక్కువ కాల పరిమితి కలిగిన పంటలు ఎంచుకుని, అపరాలు సాగు చేయడమే మంచిది. తొందరపడి పొడి దుక్కుల్లో పత్తి విత్తనాలు నాటొద్దు.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి
నెల సాధారణం నమోదు
జూన్ 131.2 123.9
జూలై 240.9 281.6
ఆగస్టు 240.0 389.7
సెప్టెంబర్ 179.0 241.1
జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో రైతులు దుక్కులు సిద్ధం చేశారు. కొందరు రైతులు పొడిదుక్కుల్లోనే పత్తి విత్తనాలు నాటారు. వరి సాగు చేసే భూముల్లో భూసారం పెంపునకు పచ్చి రొట్ట విత్తనాలను వేస్తున్నారు. అయినా వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ సూచనలతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. మరోపక్క వానాకాలం ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవ డం, ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో వారిలో సందిగ్ధత నెలకొంది. అధికారుల సూచనలను కాదని జలాశయాల్లో నీటి ఆధారంగా వరి తదితర పంటలు సాగు చేస్తే పైరు దశలో నీటి సమస్య ఎదురై, నష్టపోతామనే భావనతో రైతులు డోలాయమానంలో పడిపోయారు.


