ఖమ్మంవ్యవసాయం: వర్షాకాలం విద్యుత్ ప్రమాదాలు జరిగే ఆస్కారమున్నందున రైతులే కాక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి సూచించారు. ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగి పడడడంతో పాటు చెట్ల కొమ్మలకు వైర్లు ఆనుకొని ఉన్న చోట ప్రమాదాలు జరిగే అవకాశముంని తెలిపారు. ఈ నేపథ్యాన తడి స్తంభాలు, వైర్లను తాకొద్దని సూచించారు. తెగిన వైర్లు కనిపిస్తే 1912 లేదా వాట్సాప్ 87124 81489 నంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలే తప్ప సొంతంగా తొలగించే ప్రయత్నం చేయొద్దని తెలిపారు. అలాగే, ఇళ్లలో దుస్తులు ఆరేసేందుకు ఇనుప తీగలు కాకుండా ప్లాస్టిక్ తీగలు వాడాలని చెప్పారు. ఎవరైనా షాక్‌కు గురైతే చేతితో నేరుగా తాకకుండా కర్ర లేదా ప్లాస్టిక్ వస్తువులతో దూరం చేయాలని తెలిపారు. అలాగే, ఇళ్లు, వ్యవసాయ మోటార్లకు సరైన ఎర్తింగ్ చేయించుకోవాలని ఎస్‌ఈ ఓ ప్రకటనలో సూచించారు.
26న ‘కనకతార’
నాటిక ప్రదర్శన
ఖమ్మంగాంధీచౌక్: తొలి తెలుగు సినిమా పాటల రచయిత చందాల కేశవదాసు 150వ జయంతి సందర్భంగా ఈ నెల 26న ‘కనకతార’నాటిక ప్రదర్శన ఉంటుందని చందాల కేశవదాసు కళా పరిషత్ అధ్యక్షుడు కొండపల్లి జగన్మోహన్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఖమ్మంలో వాల్‌పోస్టర్లను పలు సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 26న సాయంత్రం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సురభి భానోదయ నాట్యమండలి కళాకారులు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ కుమార్, జగన్మోహన్‌రావు, డాక్టర్ నాగబత్తిని రవి, సీతారామారావు, డాక్టర్ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీలకు
నష్టం కలిగించొద్దు
ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీబీజీరాంజీగా పేరు మార్చి కార్మికులకు నష్టం జరిగేలా వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వ పతనం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్ హెచ్చరించారు. ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్‌లో ఆదివారం తాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ కూలీల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించి వేస్తోందన్నారు. ఈ మేరకు కార్మిక వ్యతిరేక చర్యలను తిప్పికొట్టేలా ఉద్యమించాలని సూచించారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దినేని కర్ణకుమార్ మాట్లాడుతూ.. సంఘం ఆధ్వర్యాన ఈ నెల 23న కలెక్టరేట్ ఎదుట చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. నాయకులు ఏసు, మేళ్లచెరువు వీరబాబు, సింగారపు సత్యనారాయణ, పిట్టల రాంబాబు, అయోధ్య, గోగుల ఆది పాల్గొన్నారు.
కిన్నెరసానిలో సందడి
పాల్వంచరూరల్: ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో సండే సందడి వాతవరణం కన్పించింది. ఆదివారం జిల్లాతోపాటు ఇరుగుపొరుగు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 724 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.38,125 ఆదాయం లభించింది. 400 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.25,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
నేవీ మార్కోస్‌లో
గుండాల యువకుడు
గుండాల: మండలంలోని నర్సాపురంతండాకు చెందిన బోడా నరేశ్‌నాయక్ భారత నావికా దళంలోని మార్కోస్ (మైరెన్ కమాండో)కు ఎంపికయ్యాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్‌కు దరఖాస్తు చేసుకుని పోటీ పరిక్షల్లో ప్రతిభ కనబర్చి ఎంపికయ్యాడు. శిక్షణలోనూ ఉత్తమ ప్రతిభ కనపర్చిన నరేశ్‌నాయక్ మార్కోస్‌కు ఎంపిక కావటంపై తల్లిదండ్రులు శ్రీను – సరోజ హర్షం వ్యక్తం చేశారు. ఒడిశాలో నాలుగు నెలల పాటు శిక్షణ పొందిన ఆయన త్వరలో మార్కోస్‌లో చేరబోతున్నాడని వారు తెలిపారు.


