● 241 బస్సులకు పరీక్ష చేయించని ప్రైవేట్ స్కూళ్ల బాధ్యులు ● నేటి నుంచి రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్
ఖమ్మంక్రైం: జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు సోమవారం తెరుచుకోనున్నాయి. అయితే, పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటివరకు తమ బస్సులకు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తీసుకోలేదు. ఈ నెల 12వ తేదీ వరకే అధికారులు గడువు విధించినా తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం గమనార్హం. ఫిట్‌నెస్ లేని బస్సులు రోడ్డు ఎక్కితే విద్యార్థుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యాన సోమవారం నుంచి రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుండగా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని బస్సులను సీజ్ చేస్తామని చెబుతున్నారు.
241 బస్సులు దూరం
జిల్లాలో అన్ని ప్రైవేట్ పాఠశాలలకు కలిపి 769 బస్సులు ఉన్నాయి. ఖమ్మం రవాణా శాఖ కార్యాలయ పరిధిలో 514, సత్తుపల్లి కార్యాలయ పరిధిలో 120, వైరాలో 135 బస్సులు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు 528 బస్సులకే ఫిట్‌నెస్ చేయించారు. ఇంకా 241 బస్సులకు ఫిట్‌నెస్ పరీక్ష చేయించకపోవడం గమనార్హం.
పిల్లల ప్రాణాలతో చెలగాటం
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండానే కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు పిల్లల రాకపోకలకు బస్సులు వినియోగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. బస్సులు సరైన స్థితిలో లేనందున వీటిని వినియోగిస్తే పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడినట్టేనని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏటా రూ.వేలల్లో ఫీజులు పెంచుతూ, బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ప్రతీ పాఠశాల బస్సును తనిఖీ చేసి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోతే సీజ్ చేస్తాం. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉన్నా బస్సులు నిబంధనల మేరకు లేకపోతే చర్యలు తీసుకుంటాం.
–శ్రీనివాస్, ఇన్‌చార్జ్ ఆర్‌టీఓ


