ఖమ్మంగాంధీచౌక్: రైతు జీవనం, అనుభవాలను ‘మట్టి మనిషి’నాటిక చాటిచెప్పింది. నెలనెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కతిక సంస్థ (ఆర్క్స్) నిర్వహణలో ఆదివారం రాత్రి ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ‘మట్టి మనిషి’ నాటికను ప్రదర్శించారు. డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రచించిన మట్టి మనిషి నవల ఆధారంగా వల్లూరు శివప్రసాద్ ఈ నాటిక రూపొందించగా, ఎస్.ఎం.బాషా దర్శకత్వంలో హైదరాబాద్‌కు చెందిన మిత్ర క్రియేషన్స్ కళాకారులు 50 మంది ప్రదర్శించారు. భూమి ఉత్పత్తి సాధనమే తప్ప వ్యాపార వస్తువు కాదనే సంకేతాన్ని ఈ నాటిక ద్వారా ఇచ్చారు. తొలుత బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ బాధ్యులు నాగప్రసాద్, నీరజ, తూము ప్రకాష్‌రావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కాగా, నాటికను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి వేల్పుల విజేతతో పాటు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు, మల్లంపాటి శ్రీధర్, రవిమారుత్, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, కాళ్ల పాపారావు, బుగ్గవీటి సరళ, ప్రసేన్, ఆనందాచారి, రైతు రవి తదితరులు తిలకించారు. కార్యక్రమంలో నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్‌రావు, దేవేంద్ర, డాక్టర్ నాగబత్తిని రవి, నామా లక్ష్మీనారాయణ, వేముల సదానందం పాల్గొన్నారు.


