చిన్నతనంలో బడి తెరుస్తున్నారంటే రెండు రకాల భావనలు కలిగేవి. ఓ పక్క సెలవులు ముగిశాయన్న బాధ.. మరోపక్క కొత్త పుస్తకాలు, నోట్స్‌లు, బ్యాగ్ కొన్నారన్న సంతోషం ఉండేది. మా స్వస్థలమైన కోదాడలో చదువంతా కొనసాగింది. వేసవి సెలవుల్లో రెండు నెలల పాటు చదువు, పరీక్షలు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆడుతూ, బంధువుల ఇళ్లకు వెళ్లిరావడంతో గడిచిపోయేది. సెలవులు ముగిశాక ఆటపాటలు వదిలి బడి బాట పట్టడం కొద్దిగా కష్టంగా ఉండేది. అయినా అమ్మానాన్న ప్రోత్సాహంతో చదువు కొనసాగించాను. భవితకు బాటలు వేసేది చదువేనని గుర్తించి పిల్లలు శ్రద్ధగా విద్యనభ్యసించి మంచి స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తున్నా.
– కొండపల్లి శ్రీరామ్, డీఆర్‌డీఓ, ఖమ్మం


