శిథిలం.. ఇక గతం! | - | Sakshi
Sakshi News home page

శిథిలం.. ఇక గతం!

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

● తహసీళ్లు, రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు త్వరలోనే సొంత భవనాలు ● పలుచోట్ల రూపు కోల్పోయిన తహసీల్దార్‌ ఆఫీసులు ● అద్దె భవనాల్లో పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ● వీటి స్థానంలో నిర్మాణాలకు నిర్ణయం

భయం గుప్పిట్లో..

● తహసీళ్లు, రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు త్వరలోనే సొంత భవనాలు ● పలుచోట్ల రూపు కోల్పోయిన తహసీల్దార్‌ ఆఫీసులు ● అద్దె భవనాల్లో పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ● వీటి స్థానంలో నిర్మాణాలకు నిర్ణయం

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు నూతన శోభ సంతరించుకోనున్నాయి. సొంత భవనాలు లేని, శిథిలావస్థకు చేరినవే కాక సౌకర్యాలు లేని కార్యాలయాల స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. ఈ విషయమై ఇటీవల రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన చేసిన నేపథ్యాన త్వరలోనే కొత్త భవనాలకు మోక్షం లభించనుంది. జిల్లాలోని పలు మండలాల తహసీల్దార్‌ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. అలాగే, జిల్లా రిజి స్ట్రార్‌ కార్యాలయంతోపాటు చిట్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఖమ్మం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఇంకొన్ని కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. మంత్రి ప్రకటన నేపథ్యాన అధికారులు ఈ రెండు శాఖల్లో సొంత భవనాలు లేని, శిథిలావస్థకు చేరిన వాటి నివేదిక సిద్ధం చేస్తున్నారు.

ఏళ్ల నాటి కార్యాలయాలు..

తహసీల్దార్‌ కార్యాలయాలన్నీ ప్రభుత్వ భవనాలే అయినా, వీటిలో పలు భవనాలను నిర్మించి దశాబ్దాలు గడిచిపోయింది. కొన్ని కార్యాలయాలైతే నిజాం కాలంలో నిర్మించవే కొనసాగుతున్నాయి. మధిర తహసీల్‌ను 1935 ఏడాదిలో నిర్మించారు. ఖమ్మంఅర్బన్‌ కార్యాలయానికి కూడా వందేళ్లు నిండాయి. ఇక వైరాలో తహసీల్దార్‌ కార్యాలయం శిథిలావస్థకు చేరగా ఇటీవల మరమ్మతులు చేశారు. పెనుబల్లిలో 25ఏళ్ల క్రితం నిర్మించిన భవనం ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. సత్తుపల్లి తహసీల్‌ను 1974లో ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ఉన్నప్పుడు నిర్మించారు. ఈ రెండు కార్యాలయాలు వర్షం వస్తే కురుస్తున్నాయి. కామేపల్లి తహసీల్‌ సైతం శిథిలావస్థకు చేరగా, ఎర్రుపాలెం తహసీల్దార్‌ కార్యాలయాన్ని 35 ఏళ్ల క్రితం నిర్మించారు. ఎర్రుపాలెంలో సమీకృత మండల కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు మొదలుకాలేదు.

అద్దె భవనాల్లో అవస్థలు

ఉమ్మడి జిల్లాలో జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంతోపాటు 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, బూర్గంపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంతోపాటు చిట్‌ రిజిస్ట్రార్‌, ఖమ్మం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌, ఖమ్మంరూరల్‌, కూసుమంచి, వైరా, కల్లూరు, ఇల్లెందు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యకలాపాలను అద్దె భవనాల్లోనే నిర్వర్తిస్తున్నారు. ఖమ్మం రూరల్‌తోపాటు ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్‌, ఖమ్మం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నిర్మాణానికి పోలేపల్లి వద్ద భూమి కేటాయించారు. ఇందులో ఖమ్మంరూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు.

అవసరమైన చోట

సొంతభవనాలు..

అద్దె భవనాల్లో కొనసాగుతున్నవి, శిథిలమైన రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల స్థానాన శాశ్వత భవనాలు రానున్నాయి. ఈ విషయమై ఇటీవల నిర్వహించిన సమీక్షలో మంత్రి పొంగులేటి వెల్లడించగా... అద్దె భవనాల్లో ఎన్ని కొనసాగుతున్నాయి.. శిథిలావస్థకు చేరుకున్నవి, పాలనకు అనువుగా లేని భవనాల వివరాలు సేకరించారు. జిల్లాలో పూర్తిగా శిథిలమైన భవనాల స్థానంలో కొత్తవి నిర్మించనుండగా, బాగున్నవైతే అవసరమైన మరమ్మతులు చేయనున్నారు. ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే నిర్మాణానికి శ్రీకారం చుడతారు.

జిల్లాలోని 21 మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాలు, ఖమ్మం, కల్లూరు ఆర్డీఓ కార్యాలయాలు సొంత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే, పలు కార్యాలయాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. స్లాబ్‌ పెచ్చులూడుతూ, చువ్వలు తేలి కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో ఉద్యోగులు భయం గుప్పిట్లో విధుల్లో నిర్వర్తించాల్సి వస్తోంది. ఇందులో తిరుమలాయపాలెం తహసీల్‌ మరీ అధ్వానంగా మారడంతో ఖాళీ చేసి అద్దె భవనంలోకి మార్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement