‘విత్తు’తో చిత్తు కాకుండా.. | - | Sakshi
Sakshi News home page

‘విత్తు’తో చిత్తు కాకుండా..

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

● జిల్లాలో తనిఖీలకు 21 బృందాలు ● పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో ఏర్పాటు ● పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతాంగం

విత్తనాలపై పటిష్ట నిఘా

● జిల్లాలో తనిఖీలకు 21 బృందాలు ● పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో ఏర్పాటు ● పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతాంగం

ఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యాన సాగులో కీలకమైన విత్తనాలు విషయంలో అన్నదాతలు మోసపోకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. గతంలో జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో దళారులు అధిక దిగుబడుల పేరిట నకిలీ విత్తనాలు అమ్మిన ఘటనలు వెలుగు చూశాయి. అయితే, అమాయక రైతులు వీటిని కొనుగోలు చేశాక.. పూత, కాత సమయాన అసలు విషయం బయటపడుతుండగా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. ఈనేపథ్యాన ముందుగానే నకిలీలను కట్టడి చేసేలా తనిఖీ కోసం వ్యవసాయ, పోలీసు శాఖల ఉద్యోగులతో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు.

నిరంతర తనిఖీలు

జిల్లాలోని 21 మండలాలకు గాను ఒక్కో టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందానికి మండల వ్యవసాయాధికారి, పోలీసు ఎస్సై నేతృత్వం వహించనుండగా, ఏఈఓలు, ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో కలిసి విత్తన షాపుల్లోనే కాక గ్రామాల్లో తనిఖీలు చేపడుతారు. తద్వారా షాపుల్లో అనుమతి లేని విత్తనాలు అమ్మకుండా కట్టడి చేయనున్నారు. అంతేకాక గ్రామాలకు వచ్చి లూజ్‌గా అమ్మే వారి విత్తనాలు కొనకుండా రైతులకు అవగాహన కల్పిస్తారు.

మార్కెట్‌లోకి పత్తి విత్తనాలు

వానాకాలంలో మొదటగా సాగు చేసే పంటల్లో పత్తి ఒకటి. జిల్లాలో ఈ వానాకాలం 2.69 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశముందని అంచనా వేశారు. ఇందుకోసం 6.74 లక్షల ప్యాకెట్ల విత్తనాలు అవసరం కాగా, ఇందులో వివిధ కంపెనీలకు చెందిన 4లక్షలకు పైగా ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే పత్తి విత్తనాల్లో బీటీ –2 విత్తనాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, బీటీ–3 విత్తనాలను నిషేధించింది. అయినా కొందరు అధిక దిగుబడుల పేరిట బీటీ–3 పత్తి విత్తనాల విక్రయానికి సిద్ధమవుతున్నట్లు తేలింది. సరిహద్దుగా ఉన్న ఏపీ రాష్ట్రంలోని గుంటూరు ప్రాంతం నుంచి అక్రమార్కులు కొందరు నకిలీ విత్తనాలను అమ్మేందుకు జిల్లాను ఎంచుకున్నట్లు గతంలో బయటపడింది. వీరు నిషేధిత బీటీ–3 విత్తనాలను గుడ్డ సంచుల్లో 750 – 800 గ్రాముల చొప్పున అమ్మే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు విస్తృత తనిఖీలు చేస్తూనే రైతులకు అవగాహన కల్పించడంలో నిమగ్నమయ్యారు.

పంట సాగులో విత్తనాలే కీలకమైనందున నకిలీలు మార్కెట్‌లోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని 21 మండలాల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటుచేశాం. వ్యాపారులు ఎవరైనా మోసాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. రైతులు కూడా లైసెన్స్‌డ్‌ డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేసి పంట కాలం పూర్తయ్యే వరకు రశీదులు భద్రపర్చుకోవాలి.

– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement